Friday, January 17, 2025

సిఎం అభ్యర్థి లేకుండా ఢిల్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బహుశా తొలిసారిగా, ఏ రాజకీయ పార్టీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజల ముందు ఉంచలేని పరిస్థితుల్లో జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార పార్టీకి ఎదురులేని నాయకుడైనప్పటికీ చట్టపరమైన చిక్కుల కారణంగా వారు ఆయనను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పలేకపోతున్నారు. బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ దేశ రాజధానిలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడానికి ప్రజాదరణ పొందిన లేదా బలమైన నాయకుడే లేరు. స్థానిక నాయకత్వం లేకపోవడంతో, వారు ఓటర్లను ఆకర్షించడానికి బయటి నుండి ‘దిగుమతి చేసుకున్న’ నాయకులు లేదా తమ హైకమాండ్‌లపై ఆధారపడుతున్నారు.

మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడిని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడం ద్వారా బిజెపి గతంలో ఒకసారి తప్పటడుగు వేసింది. ఓటర్లను లేదా బిజెపి కేడర్‌ను కూడా ఆమె ఉత్సాహపరచడంలో విఫలమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత, ఆమె ప్రజాజీవితంలో ఎక్కడా కనిపించలేదు. అరవింద్ కేజ్రీవాల్ అధికార ఆప్‌కి కిరీటం లేని నాయకుడు కావడంతో సాధారణంగా అందరూ ఆ పార్టీ ముఖ్యమంత్రిగా భావిస్తున్నప్పటికీ ఆయన చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన అధికారిక ఫైళ్లపై సంతకం చేయలేరు లేదా సిఎం కార్యాలయంలోకి ప్రవేశింపలేరు.

దానితో ఆయనను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ చెప్పలేకపోతున్నది. దానితో బిజెపి మార్గంలో ఆప్ కేజ్రీవాల్, సిఎం ఆతిశీ అనే డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ప్రస్తావిస్తున్నారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి చాలా ముందుగానే తన అభ్యర్థులందరినీ ప్రకటించడం ద్వారా ఆప్ సౌకర్యవంతమైన స్థితిలో ఉండగా, అభ్యర్థుల ఎంపికలో బిజెపి, కాంగ్రెస్ చివరి వరకు తికమకపడుతున్నాయి. అంతర్గత కలహాలు, బలమైన అభ్యర్థులను గుర్తించడంలో అనిశ్చితి వారి ఎంపికలను కష్టతరం చేశాయి. మొదట్లో, బిజెపి మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని సిఎం అభ్యర్థి కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల బలమైన వ్యూహాత్మక నిర్వహణతో హర్యానా, మహారాష్ట్రాలలో గొప్ప ప్రయోజనం పొందిన తర్వాత, బిజెపి ఇప్పుడు సొంతంగా సిఎం అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేకపోతోంది.

26 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న బిజెపి ఈసారి ఎట్లాగైనా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉంది. పదేళ్ల ఆప్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత అందుకు అనుకూలం కాగలదని ఆశిస్తున్నది. మొహల్లా క్లినిక్‌లు, కార్పొరేట్ స్థాయిలో మున్సిపల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలలో కొంతమేరకు కేజ్రీవాల్ దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి సాధింపలేని పాలనా విజయాలు సాధించినా గెలుపుకోసం అవి మాత్రమే సరిపోవు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన, అపరిశుభ్రమైన దేశరాజధానిగా నేడు ఢిల్లీ అప్రతిష్ఠకు గురవుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయంగా భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటుచూసినా కనిపించే వ్యర్థపదార్ధాలు, ఇవికాకుండా కాలుష్యం..

ఇవన్నీ కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, వైఫల్యాలు ప్రజల ముందు నిలుస్తున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులు అనేకమంది వెళ్లడం కూడా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఆ కేసులు అన్ని రాజకీయ కక్షసాధింపుగా నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు ఏవీ న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు లేకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెనుసవాల్‌ను ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. మరోవంక, సైతం బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో 2014 నుండి వరుసగా మొత్తం 7 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతుంది. కానీ ఆప్ మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పనిచేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో మొదటిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు. ‘శేష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసిన బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి అద్భుతమైన ప్రచారాలు వివరాలు అవాస్తవమని వెల్లడి కావడంతో వెంటనే బిజెపి తమ ప్రచారాన్ని మార్చివేశారు.

వారు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను ‘ద్వేషిస్తున్నాడని’ ఆరోపించడంపై దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి తీసుకువచ్చిన నమోదిత ఓటర్లలో అకస్మాత్తుగా, వివరించలేని పెరుగుదల ఉందని ఆప్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడాన్ని వారు ఈ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక దుష్ప్రచారంతో ఆప్‌ను ఆత్మరక్షణలో పడవేసి ప్రయత్నం కాకుండా నేరుగా ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే విధంగా బిజెపి ప్రచారం చేయలేకపోతున్నారు. చివరకు ప్రధాన మంత్రి సైతం వ్యక్తిగత విమర్శలతో కేజ్రీవాల్ ప్రభావం ప్రజలపై తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అంతేగాని, ఢిల్లీ రూపురేఖలను తాము ఏ విధంగా మార్చగలమో చెప్పే ప్రయత్నం చేయడం లేదు.

గతంలో యుపిఎ హయాంలో ఢిల్లీకి ఇతర రాష్ట్రాల మాదిరిగా పూర్తి రాష్ట్రస్థాయి అధికారాలు ఇవ్వాలని ఆందోళనలు జరిపిన బిజెపి గత పదేళ్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారాలను గణనీయంగా తగ్గించి వేసింది. పేరుకు రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికీ ఓ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బిజెపి మార్చివేసింది. మరోవంక జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చి ఏళ్ళుగడుస్తున్నా ఆ దిశలో ఎటువంటి చర్యలకు పాల్పడటం లేదు. దానితో ఢిల్లీ ప్రభుత్వంలో గణనీయ మార్పులను తీసుకురాగలమనే భరోసాను ప్రజలలో బిజెపి కలిగించలేకపోతున్నది. ఢిల్లీ తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సమయంలో పొరుగున ఉన్న హర్యానాలోని బిజెపి ప్రభుత్వం సహకరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేకపోయింది. ఢిల్లీలోని దళితుల మద్దతు పొందటం బిజెపికి ఓ సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్‌పై ఇటీవల రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన విధానం ఈ పార్టీ పట్ల దళిత వర్గాలలో ప్రతికూల సంకేతాలు వ్యాపించేందుకు దోహదపడుతున్నాయి.

ఈ క్రమంలో 12 ఎస్‌సి రిజర్వుడ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. 2015, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్‌సి రిజర్వుడ్ నియోజకవర్గాలలో బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దళితుల ప్రాబల్యం గల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నప్పటికీ బిజెపి ఏమాత్రం వారిని ఆకట్టుకోగలదో చూడాల్సి ఉంది. వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమానంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ బిజెపిలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బిజెపి వెనకాడుతుంది. పైగా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గెలుపొంది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ప్రజాదరణతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తున్న బిజెపి ఢిల్లీలో సైతం కేవలం ప్రధాని మోడీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతుంది. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయం నుండి ఓటర్లను ఆకర్షించడంతో మోడీకి సైతం పరిమితులున్నాయని స్పష్టం కావడం బిజెపికి ప్రమాద సంకేతాలను సూచిస్తున్నది.

ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం వంటి అంశాలు బిజెపి నుండి యువతను, మధ్యతరగతి ప్రజలను దూరం చేస్తుంది. అందుకనే ఢిల్లీ ఎన్నికలు బిజెపి నాయకత్వంపై అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేష్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యామ్నాయం అందించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. బిజెపికి సైతం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కాకుండా మరో నాయకుడు మోడీకి పోటీగా ఎదగడం ఇష్టం లేదు. అందుకనే కేజ్రీవాల్‌ను ఓడించడం ఆ పార్టీకి చాలా అవసరంగా ఉంది. ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓ రకంగా ఏకాకిగా పోటీ చేస్తున్నది. ప్రతిపక్షాలు ఆప్ పట్ల సానుకూలత వ్యక్తం చేయడం రాబోయే రోజులలో జాతీయ స్థాయిలో ఆ పార్టీ మరింత ఏకాకిగా మారే సంకేతాలను అందిస్తున్నది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News