మహబూబాబాద్: ప్రియురాలిని ప్రియుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి ఆవరణంలో పాతి పెట్టాడు. మృతదేహం పాతిపెట్టిన చోట పేడతో అలికి పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. చిన్నారులు ఈ విషయం బయటపెట్టడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాటి రాములు, లక్ష్మీ అనే దంపతులకు కుమారుడు గోపి, కూతురు దుర్గ, అల్లులు మహేందర్ సిగ్నల్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీనర్సింహాపురం గ్రామానికి చెందిన నాగమణి(35)తో గోపీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నాగమణికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రియుడి మోజులో పడిన నాగమణి తన కుటుంబ సభ్యులను వదిలి గోపీతో కలిసి ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాలలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గోపీ తన కుటుంబ సభ్యులు లక్ష్మీ, రాములు, దుర్గతో కలిసి నాగమణిని చంపేశారు. ఇంటి ఆవరణంలో గోతి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఈ విషయం బయటకు తెలియకుండా పేడతో అలికి అనంతరం పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు. దుర్గ పిల్లల ద్వారా ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చేసరికి నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఇంటి యజమానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని వచ్చిన తరువాత మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని సిఐ దేవేందర్ తెలిపారు.