రెండు సెషన్లుగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 13వరకు తొలివిడత 31న ఉభయ
సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి
1న బడ్జెట్ సమర్పణ మార్చి 10 నుంచి ఏప్రిల్
4 వరకు రెండో విడత సమావేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగం ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన ఎనిమిదవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రతిపాదించనున్నారు. సంప్రదాయానుసారం, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 31న లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో మొదలవుతుంది. ఆ తరువాత ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు ప్రభుత్వం సమర్పిస్తుంది. విరామానంతరం సెషన్ రెండవ భాగం మార్చి రెండవ వారంలో మొదలై ఏప్రిల్ మొదటి వారం వరకు జరుగుతుంది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం అది మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. సెషన్ ప్రథమార్ధంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ, ప్రధాని సమాధానం ఉంటాయి.