Saturday, January 18, 2025

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్:హరీష్‌ రావు

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు నిర్విరామంగా కెసిఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు అని పేర్కొన్నారు. ఇది కెసిఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయం అని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కెసిఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించడం వల్ల నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెసిఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనం అని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎపి పునర్విభజన చట్టం, సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు.

కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు పదేండ్ల కాలం పట్టింది
కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేండ్ల కాలం పట్టిందని హరీష్‌రావు చెప్పారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు ఆనాడు కెసిఆర్ సిఎం హోదాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు అయిన నెల రోజులకే సిఎం కెసిఆర్ ఆదేశాలతో, ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ 2017 జులై 14 నాడే లేఖ రాశారని తెలిపారు.

అయితే కేంద్రం ఐఎస్‌ఆర్‌డబ్లూడి చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించిందని, ఈ విచారణ వలన తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సిఎం కెసిఆర్ భావించారని అన్నారు. అందుకే ఆయన నిరంతరాయంగా ఐఎస్‌ఆర్‌డబ్లూడి యాక్ట్,1956, సెక్షన్ 3 ప్రకారం పున: పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లోనే నాటి కెసిఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, అక్టోబర్ 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టినట్లు గుర్తు చేశారు. కెసిఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్‌కి రిఫర్ చేయడానికి అంగీకరించిందని తెలిపారు.

నీటి వాటా కోసం రాజీలేని పోరాటానికి సిద్ధం
ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నీటి విడుదలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని రైతుల నుంచి తమకు పిర్యాదులు అందుతున్నాయని, ప్రాజెక్టుల కింద రైతులు వేసిన పంటలకు నీరివ్వాల్సిన భాద్యత సాగునీటి శాఖదేనని హరీష్‌రావు స్పష్టం చేశారు. యాసంగి సాగునీటి ప్రణాళికలో అదనంగా మరిన్ని ఎకరాలను చేర్చాలని, గత సంవత్సరం యాసంగిలో పంటలు ఎండిపోయిన పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృష్టి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేయడానికి బీఆర్‌ఎస్ సిద్దమని హరీష్‌రావు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News