Saturday, January 18, 2025

స్పెయిన్‌కు వెళుతున్న పడవ మునక: 40 మంది పాకిస్థానీలు మృతి

- Advertisement -
- Advertisement -

స్పెయిన్‌కు వెళ్లాలనుకున్న 86 మంది వలసదారుల పడవ మొరాకో వద్ద బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. వారిలో 50 మంది వలసదారులు మునిగిపోయి ఉంటారని వలసదారుల హక్కుల గ్రూప్ ‘వాకింగ్ బార్డర్స్’ గురువారం తెలిపింది. కాగా మొరాకో అధికారులు 36 మందిని కాపాడారు. 66 మంది పాకిస్థానీలతో మొత్తం 86 మంది వలసదారులున్న ఆ పడవ మౌరిటానియాకు జనవరి 2న బయలుదేరింది. కాపాడిన వారిలో 44 మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని ‘వాకింగ్ బార్డర్స్’ సిఈవో హెలెన మలేనో ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. కాగా పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తమ మొరాకో రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉన్నట్లు గురువారం తెలిపింది.

‘రబత్(మొరాకో)లోని మా పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఆ పడవ 80 మంది ప్రయాణికులతో వెళ్లిందని, వారిలో చాలా మంది పాకిస్థానీయులు ఉన్నారని, ఆ పడవ మౌరిటానియాకు వెళుతుండగా మొరాకో ఓడరేవు డఖ్లా వద్ద బోల్తా కొట్టిందని, ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా పాకిస్థానీలే అధికంగా ఉన్నారని తెలిపింది’ అని పేర్కొంది. బాధితులైన పాకిస్థానీలకు వీలైనంత సాయం అందించమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దర్ ప్రభుత్వ సంస్థలకు ఆదేశించారు. కాగా అక్రమ వలసలను అరికట్టే చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉదంతంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివేదిక కోరారు. యూరొప్‌కు అక్రమంగా వలస వెళ్లే ప్రయత్నంలో వందలాది మంది పాకిస్థానీ వలసదారులు ప్రతి సంవత్సరం మృత్యువు పాలవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News