Sunday, January 19, 2025

ఇకనైనా స్వేచ్ఛావాయువులు వీచాలి!

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఈ ఒప్పందం సాకారం కానున్నదనే నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. వారం రోజుల క్రితం ఒప్పందం కుదిరిందనే వార్తలు వెలువడినా, కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి అన్న చందంలో మడత పేచీలు పెట్టడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరిన్ని రాయితీలు పొందేందుకు వీలుగా ఒప్పందంలోని అంశాలనుంచి హమాస్ వెనక్కు తగ్గుతోందని, అందువల్ల ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో కుదరలేదని ప్రకటించడంతో ఈ ఒప్పందం అమలుపై నీలినీడలు అలముకున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో కాల్పుల విరమణకు ముందడుగు పడింది. ఇక పూర్తిస్థాయి మంత్రివర్గం, ఆ తర్వాత ఇజ్రాయెల్ సుప్రీం కోర్టు సరేనంటే ఒప్పందం గట్టెక్కినట్టే! మూడు దశలలో అమలు కానున్న కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తే, ఇజ్రాయెల్ తమ జైళ్లలో బంధించిన పాలస్తీనియన్లలో కొందరిని వదిలిపెడుతుంది. రెండో దశలో గాజానుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగుతాయి. ఆపై మూడో దశలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గాజా పునర్నిర్మాణ కార్యక్రమం మొదలవుతుంది. రెండో దశలో చేపట్టవలసిన కార్యాచరణపై రెండు వారాల్లో మరో దఫా చర్చలు మొదలవుతాయి. తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలేవీ కొత్తవి కావు. ఇవే అంశాలపై గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ను దారికి తెచ్చేందుకు ఖతార్, ఈజిప్టు, అమెరికా దేశాలు అనేక విఫల ప్రయత్నాలు చేశాయి. మరి, ఇప్పుడే ఇజ్రాయెల్ ఎందుకు సరేనన్నట్లు? అమెరికా అధ్యక్ష పీఠాన్ని రేపు అధిరోహించబోతున్న డొనాల్డ్ ట్రంప్ తాను పదవీ ప్రమాణం చేయడానికి ముందే యుద్ధం పరిసమాప్తి కావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని అటు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను, ఇటు ఉగ్రవాద సంస్థ హమాస్ ను హెచ్చరించిన నేపథ్యంలో నెతన్యాహూ దిగివచ్చినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాధినేతగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నెతన్యాహూకు ట్రంప్ అధికారంలోకి వస్తే పదవీగండం తప్పదని గ్రహించి ఉండవచ్చు. ఈ ముందుచూపే నెతన్యాహూను కాల్పుల విరమణవైపు మొగ్గేలా చేసిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గాజాలో చేయవలసిన విధ్వంసమంతా చేసేశాక, 46 వేల మందికి పైగా అమాయకుల ప్రాణాలు హరించాక ఇప్పుడు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు దిగిరావడంవల్ల గాజావాసులకు ఏం ఒరిగినట్లు? అని ప్రశ్నించుకుంటే ఏడాదిన్నరగా బాంబుదాడుల మధ్య బితుకుబితుకుమంటూ గడిపిన ప్రజలు కనీసం బయటకు వచ్చి శిథిలమైన తమ నివాసాలను చూసుకోవచ్చు. ప్రాణాలు కోల్పోయిన తమవారికోసం స్వేచ్ఛగా ఓ కన్నీటిబొట్టు విడవవచ్చు. అంతకుమించి, ఆకలిదప్పులతో అలమటించిపోతున్న తమ పిల్లలకు కాస్త తిండిపెట్టి కడుపు నింపవచ్చు. తాజాగా అమలు కానున్న కాల్పుల విరమణ ఒప్పందం వల్ల గాజాకు ప్రతి రోజూ ఇకపై 600 ట్రక్కుల ఆహార పదార్ధాలు, ఇతరత్రా సాయం అందుతాయి. ఈ యుద్ధం కారణంగా 20 లక్షల మంది గాజావాసులు స్వస్థలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇప్పుడు వారంతా మళ్లీ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి జరిపి 1200 మంది ఇజ్రాయెలీలను బలిగొన్నారు. 250 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో భగ్గుమన్న ఇజ్రాయెల్ సాగించిన ముప్పేట దాడి.. గాజావాసులకు తీరని దుఃఖాన్ని, జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలనూ మిగిల్చింది. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినవాళ్లనూ, ఇల్లూవాకిళ్లనూ కోల్పోయి నడివీధిలో నిలబడిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావలసిన సమయమిది. ఐక్యరాజ్యసమితితో చేతులు కలిపి, గాజా పునర్నిర్మాణానికి నడుం బిగించాలి. ఈ క్రమంలో గాజా పునర్నిర్మాణానికి 123 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించిన ఐరోపా సమాఖ్యను అభినందించాలి. ఇదే విధంగా అన్ని దేశాలూ మానవతాసాయాన్ని ప్రకటించి, గాజాను ఒడ్డున పడేసేందుకు తమ వంతు కృషి చేయాలి. మరో రెండు వారాల్లో శాశ్వత కాల్పుల విరమణ కోసం మొదలు కానున్న చర్చలు సఫలీకృతం కావాలన్నది శాంతికాముకుల, మానవతావాదుల ఆశ, ఆకాంక్ష. అది నెరవేరాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News