వడోదర: దేశవాళీ క్రికెట్ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక జట్టు విజేతగా నిలిచింది. శనివారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో కర్నాటక 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. స్మరణ్ రవిచంద్రన్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రవిచంద్రన్ 92 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.
వికెట్ కీపర్ కృష్ణన్ (78), అభినవ్ మనోహర్ (79) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత లక్షఛేదనకు దిగిన విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ధ్రువ్ శోరే (110) అద్భుత శతకం సాధించినా ఫలితం లేకుండా పోయింది. జితేశ్ శర్మ (34), హర్ష్ దూబే (63) తప్ప మిగతావారు విఫలమయ్యారు. దీంతో విదర్భకు ఓటమి తప్పలేదు. కర్నాటక బౌలర్లలో కౌశిక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్‌లు మూడేసి వికెట్లను పడగొట్టారు.