విఫలమైనా ప్రతీసారి… ఆకలి చావులు ఆపలేని దేశానికి అంతరిక్ష ప్రయోగాలు అవసరమా? అంటూ దశాబ్దాలుగా ఎగతాళి చేస్తూనే వున్నారు? పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలను స్వాతంత్య్ర భారతం నుంచి తరిమేయలేని వారికి జాబిల్లి పై విక్రమ్ జాడ అవసరమా? అంటూ వెనక్కి లాగుతూనే వున్నారు? అయినా… బాధను దిగమింగి బాధ్యతగా పని చేస్తూ.. విఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు విక్రమ్ సారాబాయ్, హోం జహంగీర్ బాబా, అబ్దుల్ కలాం వంటి ఎంతోమంది మహానుభావుల స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఎదిగితేనే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం అని నమ్మి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, తదితర సిబ్బంది అహర్నిశలు గెలుపోటములకు అతీతంగా ప్రయోగాలతో యుద్ధం చేస్తూనే వున్నారు మన దేశాన్ని గెలిపించడానికి..! ఇప్పుడు ఇండియాకే కాదు.. యావత్ ప్రపంచానికి పాఠం చెబుతుంది ఇస్రో…! ‘ఆగని ప్రయత్నాల పరంపరే అంతరిక్షపు హద్దులను చెరిపేస్తుందని, అలుపెరగని కఠోర శ్రమతో కూడిన ఆత్మవిశ్వాసపు శోభకు అనంత విశ్వం తలొంచుతుందని,
స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ విజయంతో ఇస్రో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ను నిలిపింది. భవిష్యత్‌లో స్పేస్ స్టేషన్, చంద్రయాన్- 4, గగనయాన్ తదితర ప్రాజెక్టుల విజయానికి నాంది పలికింది. డిసెంబర్ 30, 2024న చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం దశల వారీగా మన శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. కీలకమైన ఎస్‌డిఎక్స్ 01(ఛేజర్), ఎస్‌డిఎక్స్ 02(టార్గెట్) ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం చేసే దశను మనం దాటేశాం. ఈ డాకింగ్ ప్రక్రియ కోసం సెన్సర్ల సాయంతో మూడుసార్లు ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలించక చివరిలో విరమించుకోవాల్సి వచ్చింది. వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఉపగ్రహాలను వాటి వేగాన్ని నియంత్రిస్తూ, బాగా తగ్గించి, చివరికి 3 మీటర్ల దూరం వచ్చాక చాలా జాగ్రత్తగా డాకింగ్ ప్రక్రియ చేసి ఒకే యూనిట్‌గా మార్చడం చాలా కష్టం. అయినా మన శాస్త్రవేత్తలు గురువారం ఉదయం దాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు అనుసంధానమైన శాటిలైట్‌ల మధ్య విద్యుత్ ప్రసారం చేసి స్పేస్‌లో ఉపగ్రహాల మధ్య సర్వీసింగ్‌ను పరిశీలిస్తారు. ప్రయోగాలు పూర్తయ్యాక అన్ డాకింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ రెండు ఉపగ్రహాలు రెండు సంవత్సరాల పాటు మనకు సేవలు అందించనున్నాయి. ఈ అసాధారణ విజయంతో మన అంతరిక్ష ప్రయోగాల జోరు ప్రపంచ పత్రికల్లో ప్రముఖ వార్త అయ్యింది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రూ. 3,984 కోట్లతో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతం గా ప్రవేశపెడుతూ అంతరిక్ష వ్యాపారంలో దూసుకుపోతున్న మనం త్వరలోనే ఇంకా మెరుగైన ప్రయోగ ఫలితాలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఇస్రో వుంటుందని మనం గట్టిగా చెప్పవచ్చు.
ఎక్కడ మొదలుపెట్టాం మనం. సైకిల్‌పై రాకెట్ల విడిభాగాలను మోసుకెళ్ళాం. అంగారక గ్రహంపై జీవరాశి మనుగడను శోధిస్తున్నాం. తొలి ప్రయత్నంలో నిలబడలేని విక్రమ్ ల్యాండర్ అపజయంపై నాలుగు సంవత్సరాలు పెద్ద యుద్ధం చేసి పోగొట్టుకున్ళచోటే నిలబడి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ సాక్షిగా ప్రజ్ఞాన్ రోవర్‌తో అడుగులు వేయించాం. శుక్రయాన్‌కు సిద్ధమవుతున్నాం. అంతరిక్ష వ్యవసాయం కోసం అన్వేషిస్తున్నాం. మానవ సహిత రోదసీ యాత్రల కోసం ఉత్సాహంగా బయలుదేరుతున్నాం. కేవలం పాన్ ఇండియా స్థాయి సినిమాల బడ్జెట్‌తో మన మేధో అంతరిక్ష సినిమాలను ప్రపంచానికి చూపిస్తూ తగ్గేదేలే.. శభాష్ అనిపించుకుంటున్నాం. మన జాతీయ జెండాను సగర్వంగా అగ్రరాజ్యాలకు దీటుగా, స్ఫూర్తివంతంగా నిలుపుతున్నాం..! ఎలా మొదలుపెట్టాం అని కాదు! ఎంతలా ఎదిగాం అనేదే నేటి ‘మ్యాటర్’. అదే భావి భారత తరాలకు న్యూ చాప్టర్. గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు అన్నట్లు.. మన ఇస్రో ప్రయాణం, ప్రకాశం విశ్వరహస్యాల శోధనలో నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగాలి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536