భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాలలో మార్పు కానరాకుండానే ఉంది. కాలంతో పాటు శాస్త్ర, సాంకేతికపరమైన అంశాలలో అనేక వినూత్నమైన సంస్కరణలు జరుగుతున్నాయి. కానీ జనాభాలో దిక్సూచిగా, అనేక కులవృత్తులకు పునాదిగా, అన్ని వర్గాలను ఆదరించే జనక్షేత్రమైన బహుజనుల జీవితాలలో మాత్రం ఎలాంటి నూతన మార్పులు చోటుచేసుకోవడంలేదు. తరాలు మారుతున్నా బహుజన జాతుల తలరాతల్లో మాత్రం ఎలాంటి కొత్త సంస్కరణలకు బీజం పడటం లేదు. వందల సంవత్సరాల క్రితం నుండి వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తులనే నమ్ముకుని తమ జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు. బహుజనుల జాతులు ఎన్నో సంవత్సరాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చతికలపడి సతమతమవుతున్న విషయం గ్రహించిన పాలక పక్షాలు నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నాయి.
దాదాపు 300 సంవత్సరాల క్రితమే బహుజన కులాలు అగ్రవర్ణాల ఆగడాలకు, అఘాయిత్యాలకు ఆగమవుతుంటే అందరినీ ఏకతాటిపై సంఘటితం చేసి భూస్వాముల, పెత్తందారుల అధిపత్యాన్నీ బద్దలుకొట్టి, నిజాం పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించిన సర్వాయిపాపన్న గౌడ్ ఆత్మవిశ్వాసం, బహుజనుల బతుకుల్లో మార్పుకై యుద్ధం చేసిన వీరుడు బత్తిని మొగిలయ్యగౌడ ధీరత్వం ఇలా ఎంతో మంది బహుజనయోధుల చరిత్రలు ఉన్న ఈ అణగారిన వర్గాలకు ఐక్యత రాకుండానే ఉంది. దీనికి కారణం ఎవరూ అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది! బహుజన జాతి అంటే గౌడ, మంగళి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజులు, రజకులు ఇలా చెప్పుకుంటే దాదాపు వందకు పైగా కులాల క్షేత్రం. కులవృత్తిలో తమ బతుకుదెరువును వెతుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న నిరుపేదల సమూహం. జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇలా ఎంతో మంది మేధావులు, విజ్ఞావంతులు ఎన్నో సామాజిక, సిద్ధాంతపరమైన పోరాటాలు చేసిన బహుజనుల బతుకుల్లో వెలుగులు పూర్తి స్థాయిలో రాలేదు. జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న బహుజనుల ఉనికి ఏ చోట పూర్తి స్థాయిలో ఉండకపోవడం చాలా బాధాకరం. కేవలం ఓట్ల, సీట్ల ప్రాతిపదికనే బహుజన వర్గాలను బానిసలుగా మార్చి అవసరానికి వాడుకొని అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ వందల హామీలు ఇస్తూ బహుజన జాతుల మద్దతును కూడగట్టుకొని ఆ తర్వాత హామీల ఆచూకీ లేకుండా చేస్తున్నారు.
బహుజనులను కేవలం అగ్రవర్ణాల ఆధిపత్యానికి బాటలు వేసే ఓట్ల బానిసలుగా చూస్తున్నారే తప్ప వారి తరాల ఉన్నతికి, సంక్షేమానికై ఎవరూ ప్రణాళికలు చేయడం లేదు. బహుజనుల ఒక్కో కులానికి ఒక్కో కులసంఘం ఉంది. అవన్నీ ఏకతాటిపైకి వచ్చి సమష్టి కృషితో పోరాటాలు చేస్తేనే బహుజనుల్లో మార్పు తథ్యమని బిసి మేధావుల అభిప్రాయం. అగ్రవర్ణాలు తమ రాజకీయ భవిష్యత్తుకు బిసిలను బలగాలుగా చూస్తున్నారు. ఆ బలగాలు రాజ్యాధికార బావుటాను ఎగరవేయడంలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని బహుజన విజ్ఞానవంతులు ఆలోచన. అగ్రవర్ణాలు ఉన్నతమైన శాసించే పదవుల్లో ఉంటూ బిసిలను ఆశించే క్రింది స్థాయి పదవులకే పరిమితం చేసి అవమానపరుస్తూ, మనోవేదనకు గురిచేసే మాటలు మాట్లాడుతున్నా తీరు నేటి పరిస్థితుల్లో మనందరం చూస్తూనే ఉన్నాం.
ఇప్పటికే స్వార్థపూరితమైన ఆలోచనాలకు స్వస్తి పలికి, నిస్వార్థంగా అన్ని సంఘాలు సమష్టిగా శ్రమిస్తే బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయవచ్చని పలు సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రలోభాలకు, మోసపూరిత మాటలకు బానిసలు కాకుండా భవిష్యత్ బిసి తరాల ఉన్నతికై ఆలోచనాలు చేయాల్సిన అవసరం ఉంది. కనుమరుగు అవుతున్న బహుజన జాతుల కులవృత్తుల పరిరక్షణకై సమగ్రమైన, పటిష్టమైన సంస్కరణలు చేసేలా పోరాటలు చేయాల్సి ఉంది. చట్టసభల్లో కూడా బహుజనులకై సముచిత స్థానం కల్పించే దిశగా నూతన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది.
బండి వంశీకృష్ణ గౌడ్