ఇసిని కొనియాడాలి
ప్రజల శక్తి పటిష్ఠతకు టెక్నాలజీ బలాన్ని ఇసి వినియోగించింది
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ
25 ఇసి వ్యవస్థాపక దినం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఎన్నికల కమిషన్ (ఇసి)ని కొనియాడారు. ప్రజల శక్తిని సుదృఢం చేసేందుకుఇసి టెక్నాలజీ బలాన్ని వినియోగించిందని, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియ పట్ల తన నిబద్ధతను ప్రదర్శించిందని ప్రధాని మోడీ శ్లాఘించారు. జాతీయ వోటర్ల దినోత్సవంగా పాటిస్తున్న ఈ నెల 25 ఇసి వ్యవస్థాపక దినానికి ముందు మోడీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. బిజెపి పట్ల పక్షపాత వైఖరితో ఇసి వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు తరచు విమర్శిస్తున్న నేపథ్యంలో కమిషన్‌పై మోడీ ప్రశంసలు కురిపించడం గమనార్హం.
జనవరి 25 ముఖ్యమైన తేదీ అని, అదే తేదీన భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిందని మోడీ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాతలు ఇసికి అత్యంత ముఖ్యమైన స్థానం ఇచ్చారని, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి సమాన ప్రాముఖ్యం ఇచ్చారని ఆయన తెలిపారు. ‘195152లో దేశంలో తొలి ఎన్నికలు నిర్వహించినప్పుడు దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా అని కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మన ప్రజాస్వామ్యం అన్ని భయాందోళనలనూ తప్పుగా నిరూపించింది. ఏమైనా భారత్ ప్రజాస్వామ్య మాత’ అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దాల్లో కూడా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠం అయిందని, పరిఢవిల్లిందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఇసికి ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. అది ఎప్పటికప్పుడు మన వోటింగ్ ప్రక్రియను ఆధునికీకరించి, పటిష్ఠం చేసింది.
ప్రజల శక్తికి మరింత బలం చేకూర్చేందుకు టెక్నాలజీ బలాన్ని కమిషన్ ఉపయోగించింది. నిష్పాక్షిక ఎన్నికల పట్ల దాని నిబద్ధతకు ఇసిని అభినందిస్తున్నాను’ అని మోడీ చెప్పారు. ‘దేశ ప్రజలు ఎల్లప్పుడూ గరిష్ఠ సంఖ్యలో తమ వోటు హక్కు వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని, ఈ ప్రక్రియను సుదృఢం చేయాలని విజ్ఞప్తి చేయదలిచాను’ అని ప్రధాని మోడీ ఈ ఏడాది తన తొలి ‘మన్ కీ బాత్’లో చెప్పారు. ఈ నెల చివరి ఆదివారం రిపబ్లిక్ దినోత్సవం జరగనున్నందున మూడవ ఆదివారమే ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలు, ఎలక్ట్రాన్ వోటింగ్ యంత్రాల (ఇవిఎంల) నిష్పాక్షికతపై ప్రశ్నల నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. మోడీ వ్యాఖ్యలను ఇవిఎంలకు ధ్రువీకరణగా భావించవచ్చు.
ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం ఎంతో విశిష్టమైనది
ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ అత్యంత ప్రత్యేకమైనదని, అది భారత రిపబ్లిక్ 75వ వార్షికోత్సవం అని మోడీ పేర్కొన్నారు. ‘మనకు పవిత్ర రాజ్యాంగాన్ని ఇచ్చిన రాజ్యాంగ సభ మహామహులకు నా జోహార్లు. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ చర్చలు, రాజ్యాంగసభ సభ్యుల భావనలు, వారి మాటలు మనకు గొప్ప వారసత్వ సంపద’ అని మోడీ చెప్పారు. రాజ్యాంగ సభ సభ్యులు ముగ్గురు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రోత్సహించిన విలువల గురించి ప్రధానంగా ప్రస్తావించేందుకు వారి స్వల్ప ఆడియో క్లిప్‌లను ప్రధాని వినిపించారు. ప్రతి ఒక్కరి ప్రయోజనార్థం అంతా సంఘటితంగా కృషి చేయాలని అంబేద్కర్ పిలుపు ఇవ్వగా మానవత్వ విలువల పట్ల భారత్ నిబద్ధత గురించి ప్రసాద్ నొక్కిచెప్పారని మోడీ వివరించారు.
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, వివిధ కులాలు, మతాలకు చెందిన ప్రజలు సంఘటితం అయ్యారని తెలియజేశారు. అక్కడ ఏవిధమైన వివక్షా లేదని ఆయన చెప్పారు. ఈ భక్తుల బృహత్తర సమ్మేళనంలో యువజనుల విస్తృత భాగస్వామ్యం స్పష్టంగా కానవస్తోందని, ఇది నాగరికత మూలాలను పటిష్ఠం చేస్తుందని, బంగారు భవితకు భరోసా ఇస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ ఉత్సవం విశ్వ జనాదరణ ప్రతి భారతీయునికి గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ నెల రామ్ లల్లా ప్రాణ ప్రతిఫ్ఠ పర్వం తొలి వార్షికోత్సవాన్ని పుష్య శుక్ల ద్వాదశి నాడు నిర్వహించారని కూడా ఆయన తెలిపారు. ‘ఈ ఏడాది పుష్య శుక్ల ద్వాదశి ఈ నెల 11న పడింది. ఆ రోజు లక్షలాది మంది శ్రీరాముని భక్తులు అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందారు’ అని మోడీ చెప్పారు.
ఈ ఏడాది ఆరంభంలోనే భారత్ అంతరిక్ష రంగంలో అనేక చరిత్రాత్మక విజయాలు సాధించిందని కూడా మోడీ తెలియజేశారు. ‘భారత స్సేస్‌టెక్ స్టార్టప్, బెంగళూరు కేంద్రంగా గల పిక్సెల్ భారత తొలి ప్రైవేట్ ఉపగ్రహ సముదాయం ‘ఫైర్‌ఫ్లై’ని ప్రయోగించిందని తెలిపేందుకు గర్విస్తున్నాను’ అని ఆయన చెప్పారు. ఈ విజయం భారత్‌ను ఆధునిక అంతరిక్ష టెక్నాలజీలో సారథిని చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక పెద్ద ముందడుగు కూడా అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం భారతీయ శాస్త్రవేత్తలు ఉపగ్రహాల స్పేస్ డాకింగ్‌ను నిర్వహించారని కూడా మోడీ ఈ కార్యక్రమంలో తెలిపారు. అంతరిక్షంలో తయారీ కోసం కొత్త టెక్నాలజీలపై ఐఐటి మద్రాసు ఎక్స్‌టిఇఎం కేంద్రం ఏవిధంగా కృషి చేస్తోందో కూడా మోడీ ప్రధానంగా ప్రస్తావించారు.