ముగిసిన సంక్రాంతి సెలవులు
విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ లో కిటకిట
మన తెలంగాణ/హై-దరాబాద్‌ఁ : పల్లె నుంచి పట్నం బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నా యి. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారు పిల్లలకు సంక్రాంతి సెలవులు ముగియడంతో కుటుంబాలతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దాంతో బస్సులు, రైళ్లు క్రిక్కిరిసిపోయాయి. తిరుగు ప్రయాణమవు తున్న వారితో విజయవాడ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లో రద్దీ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎపిఎస్‌ఆర్‌టిసి పలు ప్రాంతా లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆర్‌టిసి అదనపు బస్సులు నడిపింది. ఆదివారం విజయవాడ నుంచి ఆర్‌టిసి 133 అదనపు బస్సులు నడిపింది.
ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేశారు. అయితే, ఈ అదనపు బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉండదని ఆర్‌టిసి స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్–విజయవాడ హైవేపై నెమ్మదిగా వాహనశ్రేణి కదిలింది. చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ చోటు చేసుకుంది. సాధారణంగా ఈ టోల్‌ప్లాజా మీదుగా రోజుకు దాదాపు 36 వేల వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రతి రోజు 70 నుంచి 80 వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు ఎన్‌హెచ్‌ఐఎ అధికారులు వెల్లడించారు. చిట్యాల, పెద్ద కాపర్తి, చౌటుప్పల్ కూడళ్లలో సైతం వాహనాల రద్దీ నెలకొంది. తూప్రాన్ పేట, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వాహనాల రద్దీ కొనసాగగా, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్ కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది.
మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే చాలా రైళ్లను నడిపిస్తుండగా మరో 8 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు ఇప్పటికే స్పష్టపర్చిన సంగతి విదితమే. అయితే భారీ సంఖ్యలో పల్లె నుంచి ప్రయాణీకులు పట్నం బాట పడుతున్న దృష్టా సోమవారం సైతం ప్రయాణీకుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అందుకనుగుణంగా ఎపిఎస్‌ఆర్‌టిసితో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సైతం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.