Monday, January 20, 2025

సాహిత్య చరిత్రకారుడు ఆచార్య పింగళి

- Advertisement -
- Advertisement -

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి 1894, వర్ధంతి 1972, రెండూ జనవరి 10 సందర్భంగా ప్రత్యేక వ్యాసం
తెలుగు సాహిత్య సుక్షేత్రంలో సాహిత్య చరిత్ర గ్రంథాలు సుమారు ఇరవై దాకా వచ్చి ఉంటాయి. వీటిల్లో దేని ప్రత్యేకత దానిదే. 1974 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూనికతో వెలుగు చూసిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతం రచించిన ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ప్రామాణికతకు గీటురాయి. సుప్రసిద్ధ కవిగా, విమర్శకుడిగా ఆచార్యుడిగా విహంగ వీక్షణంతో సాహిత్య చరిత్రను నిర్మించిన ధీశాలి పింగళివారు. నలభై ఏళ్ళపాటు వారు చెప్పిన సాహిత్య పాఠాలు శిష్య ప్రశిష్యులు నోట్ పుస్తకాల్లో రాసుకోగా, ఆ ప్రతుల్లోగల విషయాలు బాగా ప్రచారానికి నోచుకున్నాయి.

దాన్నంతా పింగళివారు ‘సవిమర్శ ఆంధ్ర సాహిత్య చరిత్ర’ గా భద్రపరుచుకోగా దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’గా నామకరణం చేసి ప్రచురించారు. పింగళి వారు ప్రాచీన తెలుగు కావ్య నాటకాదుల్ని విస్తృతంగానూ, లోతుగానూ అధ్యయనం చేసిన ప్రజ్ఞానిధి. అంతేకాదు వాటిని విద్యార్థుల మనస్సులకు హత్తుకుపోయేలాగా పాఠం చెప్పిన దేశికోత్తములు. తెలుగు సాహిత్య చరిత్ర రచనా సౌధానికి గట్టి పునాది వేసిన మేటి మేస్త్రి. లక్ష్మీకాంతం గారి కంటే ముందు వెలువడిన కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రల్లో ముఖంగా కవుల చరిత్రల్లో కవుల కుల గోత్రాలు, వారి కాలాలు, వంశచరిత్ర వంటి స్థూలమైన విషయాల్నే ఆయా రచయితలు పొందుపరిచారు కాని, కావ్యాల లోతులకు దిగలేదు.

వారి దృష్టంతా కొన్ని వందల మంది కవుల జాబితాను తయారు చేయడంలోనూ కట్టుకథలను క్రోడీకరించడంలోనూ కేంద్రీకృతమైంది. ప్రత్యేకించి యుగవిభజనగాని, దేశకాల పరిస్థితుల్నిగాని, కావ్యరచనా వైశిష్ట్యాల్నిగాని ఎక్కడా్ ప్రస్తావించలేకపొయ్యారు. అయితే పింగళి లక్ష్మీకాంతం మాత్రం ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ను కవుల పేరుతో యుగ విభజన చేసి వారి కావ్య రచనా సౌష్ఠవాల్ని చర్చించడమే కాకుండా ఆయా కావ్యాల్లోని భావము, వస్తువు, రచనల్ని లోతుగా పరిశీలించారు. పైగా సాహిత్య చరిత్రను గొప్ప చారిత్రక దృష్టితో రాసే ప్రయత్నం చేశారు. కాగా ఆనాటి కాలంలోని సాంఘిక, రాజకీయ, మత పరిస్థితుల్ని, యుగతత్త్వాల్ని వీలైనంత వరకూ ప్రతిఫలింపజేశారు.

దురదృష్టవశాత్తు పింగళివారు ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ను ప్రబంధయుగం వరకే రాయగలిగారు. ఓం ప్రథమంగా అచ్చైన పుస్తకానికి దేవులపల్లి రామానుజరావు తొలిపలుకు రాస్తూ ‘స్వర్గీయ లక్ష్మీకాంతంగారి రచనలలో యీ సాహిత్య చరిత్ర విశిష్టమైనద’ని కితాబిచ్చారు. ఇదిలా వుండగా 1994 – 1995 మధ్యకాలంలో పింగళివారి శతజయంత్యుత్సవాల సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సాహిత్య చరిత్రను పునర్ముద్రించాలని యోచించిచారు.

దాంతో పింగళివారి సాహిత్య చరిత్ర ప్రాఙ్నన్నయ కాలం నుండి ప్రబంధ యుగం వరకు ఉన్నది కాస్తా దక్షిణాంధ్రయుగం, క్షీణయుగం, ఆధునికయుగ సాహిత్య అంశాలతో కొంతలో కొంతైనా సమగ్రంగా బయటికి రాగలిగింది. దీనిని 1998 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు చాలా అందంగా ముద్రించారు. అనంతరం పలు ముద్రణలకు నోచుకోవడం ముదావహం.
అసంపూర్ణంగా వున్న పింగళివారి ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ సంపూర్ణతను పుణికి పుచ్చుకోవడానికి వారు బతికుండగా ప్రచురితమైన ‘గౌతమ వ్యాసములు’ 1955, లోని ‘ఆంధ్ర వాఙ్మయ స్థూల రూపము’ అనే వ్యాసమే పునాది అని చెప్పాలి. ఇందులో పింగళివారు వేయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రను 57 పుటల్లో ‘కొండ అద్దమందు కొంచమై ఉండదా?’ అన్నట్లు సమీక్షించారు. దీనితో పాటు 1966 లో ‘తెలుగు విజ్ఞాన సర్వస్వము’ కోసం పింగళివారు ఆచార్య బిరుదురాజు రామరాజుతో కలిసి రాసిన ‘ప్రబంధ పూర్వయుగం (క్రీ.శ. 1400-1500), ప్రబంధ యుగము (క్రీ.శ. 1500 -1875) అనే వ్యాసాలు కూడా వారి ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’కు బలమైన తోడ్పాటునందించాయనటం సముచితం.

ఆచార్య లక్ష్మీకాంతం ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ఆదర్శనీయమైనదనడానికి చాలా అంశాల్ని ప్రస్తావించవచ్చు. ప్రధానంగా వారు వాఙ్మయాన్ని ఒక జీవనదితో పోల్చి అందులోని కావ్యమనేది సర్వజనులకు ఆమోదయోగ్యంగా, అలంకార సౌందర్యంతో, చదివినప్పుడు లేదా విన్నప్పుడు ఆనందాహ్లాదాలు కలిగేలా ఉండాలని చెబుతారు. కావ్య రచయితకు పాండిత్యం, పరిశీలనం, సమబుద్ధి, నిశితదృష్టి, వ్యాఖ్యాన నైపుణ్యాలే ఆభరణాలని ఉద్ఘాటించారు. అంతేకాదు సహజ సౌందర్యమైన రసజ్ఞతతో కావ్యాన్ని ఇనుమడింప జేసినప్పడు అది ఉత్తమ కావ్యంగా శోభిల్లుతుందని విలువైన ప్రమాణాల్ని వెల్లడించారు.
అసలు సాహిత్యాన్ని యుగాలు విభజన చేయడానికి పింగళివారి మాటలు దారిదీపంగా తోడ్పడగలవు. కాగా పూర్వయుగము కంటె ఎక్కడ మార్పు వచ్చినదో అక్కడ హద్దు పెట్టాలంటారు.

రాజవంశాల పేరుతోనో, దేశ విభాగాలతోనో మరికొన్ని ప్రమాణాలతోనో యుగాల్ని విడగొట్టడం వల్ల ఉపయోగం లేదంటారు. అనువాదం, స్వతంత్రం, ఆదికాలం, మధ్యకాలం, పురాణ, ప్రబంధ యుగాలు విభజన చేస్తే చాలా విషయాలు విస్మరణకు గురి అవుతాయని అభిప్రాయపడ్డారు.

ఆచార్య పింగళివారు ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ను ప్రాఙ్నన్నయ యుగం క్రీ.శ. 1000 వరకు, నన్న య యుగం 1000 – 1100, శివకవి యుగం 1100 – 1225, తిక్కన యుగం 1225 -1320, ఎఱ్ఱన యుగం 1320 -1400, శ్రీనాథ యుగం 1400-1500, శ్రీకృష్ణదేవరాయల యుగం 1500 -1600 , దక్షిణాంధ్ర యుగం 1600- 1775, క్షీణయుగం 1775- 1875, ఆధునిక యుగం 1875-? అని కాలాలతో పాటు పది యుగాలుగా విభజించారు. అయితే కొందరు విద్వాంసులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఏతావాతా వారు చేసిన యుగ విభజననే విశ్వవిద్యాలయాలలోనూ పరమోత్కృష్టమైనదగా నమ్ముతున్నారు.

పింగళివారి ఆంధ్రసాహిత్య చరిత్రలో తులనాత్మక దృష్టి కొన్నిచోట్ల కనపడుతుంది. సామాజిక దృష్టి అరుదుగా అగుపడుతుంది. వీటికి తోడుగా భాషావైశిష్ట్యం గ్రంథ ఆద్యంతం పరవళ్ళు తొక్కింది. ఆయన రెం డు కావ్యాల్నిగాని ఇద్ద రు కవుల్ని గాని పోలిక చేయాల్సి వచ్చినప్పుడు వాటిలో ఏది ఉత్తమం ఏది అధమం అనే అంశాల్ని తార్కికంగా విశ్లేషిస్తారు. ఉదాహరణకు భారత, భాగవతాల మధ్య న్యూనాధిక్యాల్ని చెబుతూ…“అలవోకగా పాడుకుని సం తోషిందగిన పద్యములు భారతమున మచ్చుకైన ఉండవు. ఇక భాగవత పద్యాలు మధురాతి మధురములై భజన కీర్తనలవలె, పెండ్లి పాటలవలె, ఏల పదముల వలె, ఎల్లరును ఎల్లవేళల పాడుకొనుటకు అనువై సర్వత్రా గాలి వలె వ్యాపించినవంటారు. అలాగే తెనుగునగల పురాణేతిహాసములలో భాగవతమువలె సర్వజనసమ్మతమైన గ్రంథమింకొకటిలేదు. శిల్పమున, భారతము దీనికంటె మిన్నయైనను, దీనివలె సార్వజనీనమైన అనురంజకత్వమును పొందలేకపోయెన”ని అంటారు.

ఇక కవుల మధ్యగల భేదసాదృశ్యాల్ని చెప్పడం పింగళివారికి కొట్టినపిండి. మచ్చుకు సోమన. ఎఱ్ఱనల ప్రతిభాపాండిత్యాల్ని ఎలా తూకం వేశారో చూడండి. “సోమన కలిగించు హృదయ విస్తృతి బట్టి ‘ఓహో’ యని ఆశ్చర్యచకితుల మగుదుమేకాని ‘ఆహా’ అనెడి పరవశ భావము పొందము. ఎఱ్ఱన శృంగారమునకు ప్రేమబీజమైతే, సోమన శృంగారమునకు కామము బీజమ”ని సాహసించి చెప్పారు. ఆచార్య లక్ష్మీకాంతం కవుల స్వభావాల్ని ఎంతో నిశితంగా పరిశీలించే మనస్తత్వం గలవారు. దీనికి సాక్ష్యంగా శ్రీనాథుని ఆంతర్యాన్ని విన్నవించిన తీరును గమనించండి. “శ్రీనాథ మహాకవి పుట్టుకచే సౌందర్య దిదృక్షువు. దానికితోడు పరిహాస రసికుడు. చక్కని రూపము కంటబడినప్పుడు మనసార నానందించి నోరార వర్ణించుటయు, హాస్య రసపాత్రము కాదగిన వింత వస్తువునో, వింతరూపమునో చూచినప్పుడు తాను నవ్వి మనల నవ్వించుటయు అతని స్వభావము.” అని సందర్భాను సారంగా ఆయా కవుల వైదుష్యాల్ని వారి ’ఆంధ్ర సాహిత్య చరిత్ర’ రచనలో చూడవచ్చు. అట్లాగే కావ్యాల్లోని సామాజిక దృక్పథాన్ని కూడా ఎంతో సుహృద్భావంతో దృశ్యమానం చేస్తారనటానికి “పలనాటి చరిత్రను పిచ్చుకుంట్లు పాడునప్పుడు కలిగెడి భావోద్రేకము మాట అటుండగా గ్రంథము చేతబట్టి చదువుట మొదలిడినచో ప్రౌఢపద్య కావ్యోచితములైన పెక్కు సొగసులు, రసభావస్ఫోరకములైనవి అసకృత్తుగా ప్రత్యక్షమగును. ఈ రెండు కారణముల వల్ల పలనాటి పదము ఆంధ్ర చారిత్రక పద్యకవిత్వశాఖలో అగ్రతాంబూలార్హతను గడించుకొన్నది” దని కవి శ్రీనాథుని పలనాటి చరిత్రను ఉదహరిస్తారు.

పింగళివారు ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’లో 12 వ శతాబ్దానికి యుగకర్తను నిర్ణయించకుండా శివకవి యుగమని పేరు పెట్టి ముందుకు వెళ్ళడాన్ని కొందరు సాహిత్య విమర్శకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యుగంలో నన్నెచోడుడు, పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథులు ప్రసిద్ధులు కాగా వారు సృష్టించిన సాహిత్యం మత దృష్టితో ఉండడం వల్ల అది రసజ్ఞుల మన్ననలు పొందలేక పోయిందని భావించారు. ఇందులోని దేశి, జానపద సాహిత్యాలు, జానుతెనుగుల లోతులకు వెళ్ళకుం డా తిక్కన యుగానికి అడుగులు వేయడంతో సా హిత్యంలో భిన్నాభిప్రాయాలు పొడచూపుతున్నా యి. పైగా ఈ యుగంలో పింగళివారి మనసుకు నచ్చిన రసజ్ఞత కనపడక పోవడంతో ప్రాచీనత, నవీనతలకు గల లక్షణాల్ని ప్రతిపాదించారనిపించింది. ప్రధానంగా ప్రాచీన కవిత్వానికి సాధు త్వం, సహజ సౌందర్యం, అలంకరణ విరళత్వం, బహువర్ణనా రాహిత్యం, కథా ప్రాధాన్యం, భావ సంయమనాలు ప్రధాన లక్షణాలైతే, నవీన కవిత్వానికి శబ్ధాడంబరం, అర్ధచమత్కారం, అలంకరణ ప్ర చురత్వం, వర్ణనా బాహుళ్యం, భావావేశం, ఇతవృత్త ప్రపంచనాలు ప్రాముఖ్యాలని గుర్తుచేశారు.
ప్రబంధం ఆంధ్రులు ప్రత్యేకంగా పొగడదగిన ప్రక్రియగా భావించి పింగళివారు ప్రబంధ కావ్యానికి ఆరు లక్షణాల్ని సూచించారు. వాటిలో కథా వస్తువు గొప్పగా ఉండాలి, శృంగార, వీర రసాలు అంగీ అంగంగా ఉండాలి, నాయకనాయికలు : ఏకనాయకాశ్రయత్వం ఉండాలి, అష్టాదశ వర్ణనలు, ఆశ్వాసాల విభాగం, నాటకీకరణ లక్షణాలతో ప్రబంధం ప్రకృష్టంగా నిర్మితమవ్వాలని పే ర్కొన్నారు. ఇవే నేటికి అనుసరణీయంగా ఉన్నా యి.

“ఎఱ్ఱనలో బీజముగను, సోమనలో అంకురముగను పొడచూపిన ప్రబంధ లత ఈకాలమున కొనలు సాగిచిగిర్చి మారాకు వేసినద”నే పింగళివారి మాటను బట్టి పాశ్చాత్య సాహిత్యాన్ని, ఆలంకారికుల సిద్ధాంతాల్ని, సమకాలీన సమాజ పోకడల పట్ల వారికున్న విద్వత్ సంపదను అర్థం చేసుకోవచ్చు. పింగళివారి అధ్యయనం లోతైనది,  చూపు నిశితమైనది, శైలి గంభీరమైనది. ఇక అభిప్రాయం అంటారా? ‘అల్పాక్షరాల్లో అనాల్పార్థ రచన’ గా శోభిల్లుతోంది. కాని సమగ్రతను ఎక్కడా పోనియకుండా ఉంటుందని చెప్పాలి. మాటకు ‘తిరుపతి వేంకటకవులు ప్రాచీన కవిత్వానికి భరతవాక్యము, ఆధునిక కవిత్వాన్ని నాందీ వాక్యము’ అన్నమాటలే సాక్షి. దీనిని అందరూ ఒప్పుకోక పోవచ్చు. అయితే ఇటువంటి విలువైన సూక్తుల్లాంటి వచనాలు వారి రచనల్లో ధృతారగా మెరుస్తుండటం పరిపాటి. వీటి ద్వారా ఒక సిద్ధాంత గ్రంథాన్నే తయారు చేయవచ్చు.
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఇంత లోతుగా, సంయమనంగా, సంక్షిప్తంగా, విమర్శనాత్మకంగా, సంస్కారవంతంగా ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ను రాసి తర్వాతి వారికి దారిదీపమై నిలిచారు.

డా.బడిగె ఉమేశ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News