మావోయిస్టు నేత దామోదర్
మృతిపై తల్లి బతుకమ్మ వ్యాఖ్య
పోలీసులు ధ్రువీకరించలేదు
మావోయిస్టుల లేఖ మినహా
ఇతర ఆధారాలు లేవు
కుటుంబ సభ్యుల వాదన
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, ఉసూరు ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కార్యదర్శి గంగ పేరుతో విడుదల చేసిన లేఖ గందరగోళానికి తెరలేపింది. మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మృతి చెందగా అందులో 12 మంది మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. మిగిలిన మృతదేహాల కోసం పోలీసులు ఇంకా వెతుకున్నారు. అయితే, ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దామోదర్ ఆ ప్రాంతంలో లేరన్నది ప్రచారం జోరుగా సాగుతోంది. దామోదర్ మృతి చెందినట్లు లేఖ మినహా వేరే ఆధారం ఏమీ లేదు.
దామోదర్ మృతి చెంది ఉంటే అతని అంతిమ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మావోయిస్టులు విడుదల చేసేవారు. తాడ్వాయి మండలం, కాల్వపల్లిలో మాత్రం దామోదర్ కుటుంబ సభ్యులు అలాంటిది ఏమీలేదని, చనిపోయి ఉంటే తమకు మరణవార్త అంది ఉండేదని, పోలీసులు తమకు ఎటువంటి సమాచారం అందించలేదని, దామోదర్ ఎక్కడున్నా బతికుంటే చాలని అతని తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుకుంటున్నారు. దామోదర్ మృతి విషయాన్ని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించక పోవడంతో ఈ మృతిపై ములుగు జిల్లా ఏజెన్సీ మండలాలలో ఎక్కడ చూసినా దామోదర్ మృతి వార్తపైనే చర్చలు, సందేహాలు కొనసాగుతున్నాయి.
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
ఇదిలాఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ దృష్టా ఆ రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్న మావోలు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందన్న అనుమానాలతో ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేస్తున్నారు. ఏదేమైనా దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు ఎన్కౌంటర్లో మృతి చెందలేదని, సురక్షితంగా ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
పాతికేళ్లుగా అజ్ఞాతంలోనే
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు 1998 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా పీపుల్స్ వార్ పార్టీలో చేరి దళ సభ్యుడి నుండి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి 27 సంవత్సరాలు అజ్ఞాతంలోనే ఉన్నాడు. బడే ఎల్లయ్య, బడే బతుకమ్మల సంతానం బడే చొక్కారావు బాల్యమంతా కాల్వపల్లిలో సాగింది. 1997లో గోవిందరావుపేట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 1997, 98 విద్యా సంవత్సరంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విభాగంలో అరంగేట్రం చేశాడు. అతని సోదరుడు బడే మురళి ఎన్ కౌంటర్ తర్వాత పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
తొలుత దళ సభ్యుడిగా, ఎల్జిఎస్ కమాండర్‌గా, డిప్యూటీ కమాండర్‌గా, ఏటూరునాగారం ఏరియా కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. 2013 ఏప్రిల్ 16న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, పువ్వర్తి ఎన్కౌంటర్లో అప్పటి కెకెడబ్య్లు కార్యదర్శి మర్రి రవి అలియాస్ సుధాకర్‌తో పాటు అతని భార్య పుష్ప, బడే చొక్కారావు భార్య మృతి చెందారు. మర్రి రవి అలియాస్ సుధాకర్ మృతి చెందిన అనంతరం మావోయిస్టు పార్టీ దామోదర్‌కు కెకెడబ్య్లు కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో తమ మార్కును చూపెడుతూ వచ్చారు. ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను పేల్చిన ఘటనలో దామోదర్ ప్రధాన పాత్ర పోషించాడు.
మంగపేట మండలం, కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ డిజిఎం హత్య కేసులో కీలక భూమిక పోషించాడు. అనేక ఎన్‌కౌంటర్లలలో చాకచక్యంగా తప్పించుకుంటూ, తన సహచర నాయకులను, దళ సభ్యులను కాపాడుకుంటూ ఎన్నో ఎన్కౌంటర్లలో పోలీసులపై ఎదురు దాడి చేస్తూ ఉద్యమాన్ని రక్షించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర తెలంగాణపై ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.