Monday, January 20, 2025

అభివృద్ధిని అడ్డుకోవడం విజ్ఞత కాదు

- Advertisement -
- Advertisement -

ప్రజలకు మంచి చేయకుండా కాళ్లలో కట్ట్టె పెట్టి అడ్డుపడుతున్న విపక్షం
పదేళ్లలో రైతు రుణమాఫీని అమలు చేయని గత సర్కార్

ఏడాదిలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపించాం

26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు శ్రీకారం

ఎరుపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఆ రాజకీయం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతూ అభివృద్ధి జరగకుండా అడ్డుపడాలనే ఆలోచన చేస్తే అది రాజకీయ విజ్ఞత అనిపించుకోదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, నరసింహపురం, బుచ్చిరెడ్డిపాలెం, బనగండ్లపాడు, తక్కెళ్ళపాడు, సకినవీడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎర్రుపాలెం మండలానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు వందల మంది కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన వారికి కండువా కప్పు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయకుండా కాళ్లల్లో అడ్డుగా కట్టె పెట్టడం మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదని ప్రతిపక్షాలకు సూచించారు. పాదయాత్రలో విన్న ప్రజల గుండె చప్పుడుని అంకెలుగా మార్చి ప్రజల సమస్యలను ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి బాట వేస్తున్నదని తెలిపారు.

పదేళ్లు ధనిక రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు రుణమాఫీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. నాలుగు విడతల్లో అమలు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, అసలు అలాగే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేయలేని రుణమాఫీని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం ఏడాదిలోనే రెండు లక్షల వరకు రుణమాఫీకి రూ.22 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా బిఆర్‌ఎస్ ఎగ్గొట్టిన డబ్బులను అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.7,624 కోట్లు జమ చేసిందన్నారు.

వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రూ.8400 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్టు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ముందుకు తీసుకుపోతున్నదని, రాష్ట్రంలోని 28 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను రైతుల పక్షాన డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News