కేరళలో బాయ్‌ఫ్రెండ్‌ను 2022లో చంపిన గ్రీష్మ అనే యువతికి స్థానిక నెయ్యట్టింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మూడవ నిందితుడు, ఆమెకు సహకరించిన ఆమె మేనమామ నిర్మలకుమారన్ నాయర్‌కు కోర్టు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. విద్యాపరమైన తన విజయాలు, గత నేర చరిత్ర లేకపోవడం, తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెను కావడం వంటి కారణాలను పేర్కొని తనకు శిక్ష విధించడంలో కనికరం చూపాలని 24 ఏళ్ల దోషి కోర్టును అభ్యర్థించింది. అయితే, ఆమె క్రూర నేరానికి పాల్పడి, సాక్షాలను చెరిపివేసి, దర్యాప్తును తప్పుదోవ పట్టించిందని, ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకోలేమని కోర్టు తన 586 పేజీల తీర్పులో స్పష్టం చేసినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. తనతో రిలేషన్‌షిప్ ముగించేందుకు శరణ్ రాజ్ (23) ఒప్పుకోలేదని పెస్టిసైడ్ కలిపిన డ్రింక్ తాగించి అతనిని గ్రీష్మ చంపేసింది.
ఆ ఘాతుకం జరిగిన సమయానికి ఆమె వయస్సు 22 సంవత్సరాలు. ఇక ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయడానికి సందర్భోచిత, డిజిటల్, శాస్త్రీయ అంశాలపై ఆధారపడిందని కోర్టు పేర్కొన్నది. దోషి దశలవారీగా ఈ నేరం సాగించడానికి కుట్ర పన్నిందని, ఆమెకు నేర నేపథ్యం ఉందని, గతంలో ఆ యువకుని హత్యకు ప్రయత్నించిన ఆమె దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు అరెస్టు తరువాత తన ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించిందని కూడా కోర్టు పేర్కొన్నది. కాగా, ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని వాదించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ విఎస్ వినీత్ కుమార్ మీడియాతో చెప్పారు. ఇది ఆదర్శప్రాయమైన ఒక తీర్పుగా ఆయన పేర్కొన్నారు.
2022లో గ్రీష్మ తన ప్రియుడు శరణ్ రాజ్‌కు పారాక్వాట్ అనే పెస్టిసైడ్ కలిపిన ఆయుర్వేద టానిక్‌తో విషం ఇచ్చింది. దానితో అతని శరీరంలోని పలు అవయవాలు విఫలం కావడంతో 11 రోజుల తరువాత అతను చనిపోయాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీలో పని చేసే ఒక వ్యక్తితో తన పెళ్లి ఖాయం కావడంతో రాజ్‌తో తన అనుబంధాన్ని ముగించాలని ఆమె అనుకుంది. కానీ తమ సంబంధం ముగింపునకు అతను నిరాకరించడంతో హత్యకు గ్రీష్మ పథకం వేసింది. హతుడు శరణ్ రాజ్ తిరువనంతపురం జిల్లా పరశ్శల వాసి. హత్యతో సహా భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద గ్రీష్మ దోషిగా తేలింది. ఆమె మేనమామ నిర్మలకుమారన్ నాయర్ సాక్షాలను ధ్వంసం చేసిన కేసులో దోషిగా తేలాడు. అయితే, కస్టడీలోకి తీసుకున్న అతని తల్లి సాక్షాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల అయింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించిన అప్పటి ఎస్‌పి డి శిల్ప కోర్టు తీర్పును స్వాగతిస్తూ, పోలీస్ దర్యాప్తు బృందం సమష్టి కృషికి ఇది విజయం అని అన్నారు.