కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రి హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు శిక్ష ఖరారైంది. సంజయ్ రాయ్‌కు కోల్‌కతా సీల్డా కోర్టులోని అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64, 66, 103(1) కింద సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించారు. మరణించే వరకు దోషిని జైలులోనే ఉంచాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అతనికి రూ. 50 వేల జరిమానాను కూడా న్యాయమూర్తి విధించారు. ఈ నేరం ‘అత్యంత అరుదైన’ కేటగరీలోకి రాదని, అందుకే దోషికి మరణ శిక్ష విధించడం లేదని న్యాయమూర్తి దాస్ చెప్పారు. అంతే కాదు, బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ పరిహారం తీసుకునేందుకు మృతురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. ‘పరిహారం కాదు& మాకు న్యాయం కావాలి’ అని వారు స్పష్టం చేశారు.
నిరుడు ఆగస్టు 9న విధుల్లో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిరూపణ అయింది. ఈ ఘాతుకం దేశవ్యాప్తంగా ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా, సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలకు దారి తీసింది. ఈ కేసులో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆర్జి కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌పై కూడా అనుమానాలు కలిగాయి. కోల్‌కతా పోలీస్ శాఖకు చెందిన మాజీ పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను బిఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 66 (మరణానికి కారకుడైనందుకు శిక్ష), 103(1) (హత్య) కింద దోషిగా నిర్ధారించారు. సెక్షన్ 64 కింద రూ. 50 వేల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో మరి ఐదు మాసాల ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెక్షన్ 103(1) కింద రూ. 50 వేల జరిమానాతో పాటు జీవిత ఖైదు, జరిమానా చెల్లించకపోతే మరి ఐదు మాసాల ఖైదు శిక్ష విధించినట్లు న్యాయమూర్తి చెప్పారు.
అదనంగా సెక్షన్ 66 కింద దోషికి మరణించే వరకు జీవిత ఖైదు శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలియజేశారు. అన్ని శిక్షలు ఏక కాలంలో అమలు అవుతాయని న్యాయమూర్తి దాస్ తెలిపారు. ‘సిబిఐ మరణ శిక్ష విధించాలని అభ్యర్థించింది. మరణ శిక్ష బదులు కారాగార శిక్ష విధించాలని డిఫెన్స్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు& ఈ నేరల అత్యంత అరుదైన కేసుల కేటగరీలోకి రాదు’ అని న్యాయమూర్తి వివరించారు. ‘బాధితురాలు తన పని ప్రదేశం ఆసుపత్రిలో డ్యూటీలో ఉండగా మరణించినందున డాక్టర్ కుటుంబానికి పరిహారం చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వానిది& మరణానికి రూ. 10 లక్షలు, అత్యాచారానికి రూ. 7 లక్షలు పరిహారం చెల్లించాలి’ అని దాస్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు రాయ్‌కు ఉందని, కావాలనుకుంటూ న్యాయ సహాయం అందజేయగలమని అతనితో న్యాయమూర్తి చెప్పారు. దోషి, డిఫెన్స్ న్యాయవాది, బాధితురాలి కుటుంబం. సిబిఐ తుది వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. అంతకు ముందు తాను అమాయకుడినని, తనను ‘తప్పుగా దోషిగా పేర్కొన్నారు’ అని రాయ్ కోర్టులో వాదించాడు. ‘నన్ను ఇరికిస్తున్నారు. నేను ఏ నేరమూ చేయలేదు. నేను ఏమీ చేయలేదు. అయినప్పటికీ నన్ను దోషిగా తేల్చారు’ అని రాయ్ కేసులో తీర్పునకు ముందు కోర్టుకు తెలిపాడు.