Monday, January 20, 2025

శాసనసభల తక్కువ సమావేశాలు ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

శాసనసభల సమావేశాల సంఖ్య తగ్గుతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సభాపతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 85వ అఖిల భారత సభాపతుల సమ్మేళనం (ఎఐపిఒసి) ప్రారంభ సమావేశంలో బిర్లా ఆ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ శాసనసభ తన పూర్తి ఐదు సంవత్సరాల హయాంలో కేవలం 74 సమావేశాలు నిర్వహించిందనే వార్తల మధ్య ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో అంతరాయాల యోచన పట్ల కూడా లోక్‌సభ స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని పరిరక్షించేందుకు మార్గదర్శక సూత్రాలు రూపొందించవలసిందిగా రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘స్టాండింగ్ కమిటీలు మినీ పార్లమెంట్‌లు. వాటి పని తీరును పటిష్ఠం చేయవలసిన ఆవశ్యకత ఉంది’ అని ఓమ్ బిర్లా సూచించారు.

85వ ఎఐపిఒసికి రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, బీహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, దేశం అంతటి నుంచి రాష్ట్ర శాసనసభల అధిపతులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ఉదయం ఓమ్ బిర్లాతో భేటీ అయ్యారు. కానీ ‘75వ రాజ్యాంగ వార్షికోత్సవం: రాజ్యాంగ విలువల పటిష్ఠతలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల కృషి’ అంశంపై రెండు రోజుల సమ్మేళనానికి ఆయన విచిత్రంగా గైర్‌హాజరయ్యారు. పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ అధ్యయనం ప్రకారం, కాలపరిమితి ముగుస్తున్న ఢిల్లీ శాసనసభ తన ఐదు సంవత్సరాల హయాంలో 74 సమావేశాలు నిర్వహించింది. అంటే సగటున ఏడాదికి 15 రోజుల సమావేశం అయిందన్నమాట. సభ సమావేశమైన రోజుల్లో అది సగటున మూడు గంటలు భేటీ అయింది. సభ తన హయాంలో కేవలం 14 బిల్లులు ఆమోదించింది. పూర్తి కాలం పనిచేసిన గత ఏ అసెంబ్లీకైనా అది అత్యల్ప సంఖ్య.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News