దేశ సార్వభౌమత్వాన్ని బెదరిస్తూ’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై అస్సాంలో ఒక పోలీస్ కేసు నమోదైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ ఫిర్యాదును ‘రాజకీయ నాటకం’గా సోమవారం కొట్టివేసింది. క్రితం వారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలపై శనివారం సాయంత్రం గౌహతిలోని పాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది మన్‌జిత చెటియా ఒక ఫిర్యాదు దాఖలు చేశారని పోలీసులు వెల్లడించారు. ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతి ఒక్క సంస్థను గుప్పిటలోకి తీసుకున్నాయని, మేము ఇప్పుడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ఏకంగా భారతదేశంతో పోరాడుతున్నాం’ అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చెప్పారని చెటియా ఆరోపించారు. ‘భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కించపరిచే తలంపుతో, ఉద్దేశపూర్వకంగా,
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీయాలన్న ఉద్దేశంతో’ కాంగ్రెస్ నేత ఆ వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఆరోపించారు. ‘ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందలేక కేంద్ర ప్రభుత్వంపైన. భారతదేశంపైన అసంతుష్టిని రెచ్చగొట్టాలని నిందితుడు చూస్తున్నారు’ అని చెటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్లు 152, 197(1)(డి) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అస్సాం శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు దేవవ్రత సైకియా ఈ కేసుకు స్పందిస్తూ, ‘రాహుల్ గాంధీపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఒక రాజకీయ నాటకం. ప్రతిపక్షం వాణనిని బెదరించేందుకు బిజెపి తరఫున ఒకరు ఈ కేసు దాఖలు చేశారు’ అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను సైకియా సమర్థిస్తూ, పలు సందర్భాల్లో ఇడి, సిబిఐ వంటి సంస్థలు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం పనుపున వ్యవహరించాయని ఆరోపించారు.