15 నెలల పాటు కొనసాగిన యుద్దానికి తాత్కాలిక విరమణ ఒప్పందం కుదరడంతో అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ తమ బందీలను విడుదల చేసే ఘట్టాన్ని ప్రారంభించాయి. ఈ విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం నుంచి అమలు లోకి రావడంతో విధ్వంస యుద్దానికి తెరపడుతుందన్న ఆశలు చిగురించాయి. రోమి గోనెన్( 24) , ఎమిలీ దామరి(28 ), దోరోన్ స్టీన్ బ్రెచర్ (31 )అనే ముగ్గురు మహిళా బందీలను హమాస్ ఆదివారం విడుదల చేసింది. వీరిలో దామరి తన చేయిని విజయచిహ్నంగా పైకెత్తి ఊపడం కనిపించింది. అక్టోబర్ 7న దాడిలో ఆమె రెండు వేళ్లు కోల్పోయినట్టు కుటుంబీకులు తెలిపారు., ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వారిని ఉద్దేశించి యావత్ దేశం మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుందని భావోద్వేగంతో మాట్లాడేరు. ఏడు గంటల తరువాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 90 మంది పాలస్తీనియన్ ఖైదీలకు విముక్తి కల్పించింది.
విడుదలైన 90 మంది పాలస్తీనా ఖైదీల్లో ఇజ్రాయెల్ బద్ధ విరోధి ఖలీనా
విడుదలైన పాలస్తీనియన్ బందీల్లో ఇజ్రాయెల్‌కు బద్ధ విరోధి అయిన 62 ఏళ్ల ఖలీదా జర్రర్ ఉండడం విశేషం. 1970 లో ఇజ్రాయెల్‌పై దాడిలో ఆమె కీలక పాత్ర వహించారు. విడులైన పాలస్తీనా బందీలను రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించడంతో సోమవారం వారు ప్రత్యేక బస్సుల్లో గాజా స్ట్రిప్‌కు చేరుకున్నారు. వీరికి పాలస్తీనా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వీరిని చూడడానికి భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు తరలి వచ్చారు. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్ చెరలో ఉన్న తమ వారిని చూసుకుని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. ఒప్పందంలో భాగంగా తొలి విడతగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తర్వాత విడతల వారీగా మొత్తం 2000 మందిని విడిచిపెడుతుంది. హమాస్ కూడా ఇప్పటికే ముగ్గురిని విడుదల చేయగా, రానున్న ఆరు వారాల్లో మిగతా 33 మందిని విడిచిపెట్టనున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలును హమాస్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించింది.
ఒప్పందం అమలు కొన్ని గంటలు ఆలస్యం కావడంతో , ఈలోగా ఖాస్ యూనిస్ నగరం దక్షిణ భాగంపై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. సాంకేతిక క్షేత్ర కారణాల వల్లే ఒప్పందం అమలు ఆలస్యమైనట్టు హమాస్ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, మానవతా సహాయాన్ని అందించేందుకు గాజా స్ట్రిప్‌కు భారీగా ట్రక్కులు చేరుకుంటున్నాయి. సుమారు 630 కి పైగా ట్రక్కుల్లో పెద్ద మొత్తంలో నిత్యావసర సరకులతోపాటు వివిధ వస్తువులు వచ్చాయని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు. వాటిలో 300 ట్రక్కులు గాజాకు ఉత్తరాది నుంచి చేరుకున్నాయని చెప్పారు.
గాజాకు తిరిగి వస్తున్న పౌరులు
యుద్దంతో విధ్వంసం అయిన గాజాలో ఆదివారం పౌరుల సంబరాలు మిన్నంటాయి. హమాస్ కాల్పుల విరమణ అమలు ఆలస్యం చేసినా , మరోపక్క ఇజ్రాయెల్ తమ వాయుసేన దాడులు కొనసాగిస్తున్నా లక్ష పెట్టక వేలాది మంది పౌరులు కాలినడకన, గాడిదల బండ్లపై గాజాకు చేరుకోవడం కనిపించింది. మాస్క్‌లతో ఉన్న మిలిటెంట్లు అక్కడక్కడ కనిపించారు. వారికి మద్దతుగా కొందరు నిర్వాసితులు నినాదాలు చేశారు. రఫా దక్షిణ నగరంలో ప్రజలు తమ నివాసాలకు భారీ ఎత్తున చేరుకున్నారు. శిథిలాల కింద పుర్రెలతోసహా మానవ అవశేషాలను చూసి ఆవేదన చెందారు. వీధుల్లో కొన్ని మృతదేహాలు కొన్ని వారాలుగా పడి ఉన్నాయి.
పునరుద్ధరణకు కొన్నేళ్లు …
15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 46 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో సగం మంది మహిళలు, పిల్లలే. 1.10 లక్షల మంది గాయపడ్డారు. 23 లక్షల మంది ఉన్న జనాభాలో 19 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ బాంబుల దాడికి 59 శాతం ఆస్తులు ధ్వంసం అయ్యాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వీటిని పునరుద్ధరించడానికి కొన్ని దశాబ్దాలు పడతాయని అంచనా వేస్తున్నారు.