మన తెలంగాణ/హైదరాబాద్ :వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ఎయిర్‌పోర్టులో భేటీ అయ్యారు. మం త్రులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్ ఎయి ర్ పోర్టుకు చేరుకోగా అదే ఎయిర్ పోర్టుకు చంద్రబాబునాయుడు టీం చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సిఎంలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బా బు, లోకేశ్, రాంమ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
దావోస్ లో వరల్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందానికి జ్యురిచ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.సిఎం వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్ ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరుపనుంది. జ్యురిచ్ నుంచి సిఎం రేవంత్‌రెడ్డి ప్రతినిధి బృందం దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు రైలులో వెళ్లింది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించాం : రేవంత్‌రెడ్డి
జ్యూరిచ్ విమానాశ్రయం వెయిటింగ్ లాంజ్‌లో జరిగిన అనుకోని సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి ఎపి సిఎం చంద్రబాబుతో చర్చించడానికి వీలు కల్పించిందని సిఎం రేవం త్‌రెడ్డిలో పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులు జురిచ్ విమానాశ్రయం వెయిటింగ్ లాంజ్‌లో మాట్లాడుంటున్న ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈనెల 23 వరకు సిఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చించనుంది.