Tuesday, January 21, 2025

ట్రంప్ 2.0

- Advertisement -
- Advertisement -

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్
ట్రంప్ క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో
ప్రమాణస్వీకార కార్యక్రమం దేశాధ్యక్షుడిగా ట్రంప్
బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి ఉపాధ్యక్షుడిగా
జెడి వాన్స్ ప్రమాణస్వీకారం హాజరైన దేశవిదేశీ
ప్రముఖులు భారత్ తరఫున పాల్గొన్న విదేశాంగ శాఖ
మంత్రి జైశంకర్ ముఖేశ్ అంబానీ దంపతులు హాజరు
పాల్గొన్న సుందర్ పిచాయ్, ఎలాన్‌మస్క్

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 10.30గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ పదవీప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదమని పునరుద్ఘాటించారు. దేశంలో హింసను ఉక్కుపాదంతో అణచివేస్తానని స్పష్టం చేశారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావాల్సి ఉందని వివరించారు. అక్రమ వలసలను అరికడతానని ప్రతిన బూనారు. అమెరికా దక్షిణ ప్రాంత సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తానని స్పష్టం చేశారు. అమెరికాకు ఇక స్వర్ణయుగమని ప్రకటించారు.

వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి 10. 30 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్‌లో వివిధ దేశాల ప్రముఖులు, అతిధులు అశేష ప్రజానీకం కరతాళ ధ్వనుల హోరులో ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌చే ప్రమాణస్వీకారం చేయించారు. ట్రంప్ రెండోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అమెరికా అధ్యక్షునిగా అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షునిగా జెడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక , టెక్ దిగ్గజాలు, ప్రపంచ కుబేరులతోపాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అతివైభవంగా జరిగింది. మొదట వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌కు జోబైడెన్ దంపతులు స్వాగతం పలికా రు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటర్, జార్జిబుష్, బరాక్ ఒబామా, ప్రస్తుత అద్యక్షుడు జోబైడెన్ సహా పలువురు ప్రముఖులు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ బిలి,

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, చైనా ఉపాధ్యక్షుడు హన్ ఝెంగ్, భారత ప్రధాని మోడీ తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. వీరితోపాటు రిలయన్స్ అదినేత ముకేశ్ అంబానీ దంపతులు, టెక్ దిగ్గజ కంపెనీలైన టెస్లా, స్సేస్ ఎక్స్ చీఫ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో సుందర్ పిచాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్‌లో అద్భుతమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా స్టార్ సింగర్ క్యారీ అండర్‌వుడ్ ప్రదర్శనతోపాటు ఇతర లెజెండరీ కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో అతిథులను అలరించారు. విపరీతమైన చలి కారణంగా ఈ వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తరువాత ఇప్పుడు రెండోసారి అలా జరిగడం గమనార్హం.

ట్రంప్ కుటుంబ నేపథ్యం
1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగోవారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్‌లో 1968లో డిగ్రీ పొందారు. తండ్రి కం పెనీలో 1971లో బాధ్యత స్వీకరించిన ట్రంప్.. అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. హోటల్స్, రిసార్డులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సుల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు. క్రీడాకారిణి, మోడల్ ఇవా నా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్ 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్‌లు సంతానం. ఆ తర్వాత నటి మార్లా మార్పెల్స్‌ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్, 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ ట్రంప్. స్లోవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు.

వీరి కుమారుడు బారన్ విలియమ్ ట్రంప్. రిపబ్లికన్ పార్టీ తరఫున 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్ , డెమోక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి పొందారు. మళ్లీ 2024లో బరిలోకి దిగారు. డెమోక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News