Tuesday, January 21, 2025

కృష్ణా నదీ జలాల వివాదం ఇంకెన్నాళ్లు?

- Advertisement -
- Advertisement -

నేడు హైదరాబాద్‌లో మరోసారి కీలక సమావేశం

ప్రతి రాష్ట్రానికి నీటిపారుదల రంగం అత్యంత కీలకమైనది. దేశంలో ఉన్న ముఖ్యమైన నదులు అంతరాష్ట్ర స్వభావం కలిగినవి కావటంతో రాష్ట్రాల మధ్య నీటి పంపకంలో తగవులు ముందుకు వస్తున్నాయి. వీటిని తీర్చవలసిన కేంద్ర ప్రభుత్వాలు, ఆ తగవులను పెంచుతున్నాయే తప్ప పరిష్కారం చేయటం లేదు. కృష్ణా నదీ జలాల పంపకంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలమధ్య నిత్య తగవులుగా మార్చింది. కేంద్ర మంత్రివర్గం తెలుగు రాష్ట్రాల కృష్ణా నది నీటి పంపకాల వివాదాల పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్ 2కు మోడీ ప్రభుత్వం అప్పగించటం అందులో భాగమే. భారతదేశంలోని గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి నదుల తర్వాత కృష్ణా పెద్ద నది. ఇది మహారాష్ట్ర, కర్నాటక నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల విభేదాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాలమధ్య నీటి పంపకంకోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వం 1969 ఏప్రిల్‌లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. దీనికి ఆర్‌ఎస్ బచావత్ అధ్యక్షులు కాగా, డి.ఎం బండారి, డిఎం సేన్‌లు సభ్యులుగా ఉన్నారు.

ఇదే బచావత్ ట్రిబ్యునల్‌గా ప్రచారం పొందింది. కృష్ణా నదీ నీటి లభ్యతపై సమగ్ర పరిశీలన చేసి, దాని అనుబంధ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని 1973మేలో ప్రభుత్వానికి బచావత్ ట్రిబ్యునల్ నివేదిక అందించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 1976లో దాన్ని ప్రకటించింది. అదనంగా వచ్చే నీటిని కూడా దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టిఎంసిలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. నది లో మిగులు జలాలను 330 టిఎంసిల అంచనా వేసి, అందులో 25% మహారాష్ట్రకు, 50% కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 25% పేర్కొంది. మిగుల జలాల పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే పార్లమెంట్ జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 1976 నాటికి మిగులు జలాల తీర్పును కేంద్రం ఆమోదించకపోవటంతో తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలపై హక్కు కల్పించారు. బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపిణీ గడువు ముగియటంతో, దాన్ని పొడిగించకుండా అది ఉండగానే, జస్ట్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షులుగా, జస్టిస్ ఎస్‌పి శ్రీవాస్తవ, జస్ట్టిస్ డికె సేఠ్ సభ్యులుగా 2004 ఏప్రిల్‌లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. శ్రీవాస్తవ మరణించగా ఆయన స్థానంలో బిపి దాస్‌ను నియమించింది. దీని పేరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2. దీన్నే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని పిలిచారు. ఈ ట్రిబ్యునల్ 2007 జులైలో పని ప్రారంభించి, మూడు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత మొదటి ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే 75% 65% మధ్య ఉన్న 448 టిఎంసిల్లో మహారాష్ట్రకు 81 టిఎంసిల, కర్ణాటకకు 177 టిఎంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 190 టిఎంసిలను అంతకు ముందు కేటాయింపుల అదనంగా కేటాయిస్తూ 2010లో తీర్పును వెలువరించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కి 1001, కర్ణాటకకు 911, మహారాష్ట్రకు 666 టిఎంసిలుగా పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య ముందుకు వచ్చింది.

ఈ వివాదం గత విభేదాల నేపథ్యంలో వచ్చినవే. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం, కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, వాటికి నీటి విడుదల విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ముందుకు తెచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా వీటినే కెసిఆర్ చెబుతూ వచ్చారు. ఈ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టిఎంసిల నీటిని ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు పంపకం చేయటం జరిగింది. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపులు రావడాన్ని దిగువన ఉండటం వంటి కారణాలు చెబుతున్నారు. ఇంతకు ముందు ట్రిబ్యునల్ తీర్పుల్లో తెలంగాణ లేదు కాబట్టి, దాని వాదన వినేందుకు కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ కోరుతున్నది. దాని కోసం 2014లో కేంద్రానికి లేఖ రాసింది. కొత్త ట్రిబ్యునల్ గురించి మాట్లాడ కుండా కేంద్రం మాత్రం పాత ట్రిబ్యునల్‌ను రెండు సంవత్సరాలను పొడిగించింది.తిరిగి కేటాయింపుల కొత్తగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీనికి కర్ణాటక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి తగవులు పరిష్కరం కావటం ఇష్టం లేని మోడీ ప్రభుత్వం, వివాదం సుదీర్ఘ కాలం కొనసాగేలా రెండు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇది మోడీ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయం.

కృష్ణా నదీ నీటి జలాలు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. వివాదాలు కూడా ఆ పరిధిలోనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులో నాలుగు రాష్ట్రాలు ఉండాలి. మహారాష్ట్ర, కర్నాటకను మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి మినహాయించటమంటే, వాటిని వివాదం నుండి తప్పించటమే. తెలంగాణ, ఎపిలు వివాదంలో కూరుకుపోయేటట్లు చేయటమే. ఆచరణలో అదే జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి తగవు ప్రారంభమైంది. ఇది మోదీ ప్రభుత్వం సృష్టించినదే. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా డెవలప్‌మెంట్ బోర్డును వ్యతిరేకించకపోవటం రెండు రాష్ట్రాలు చేసిన తప్పిదం.

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పడినా సమస్యల పరిష్కారానిక చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. అప్పుడప్పుడు సమావేశమై అవసరాలకు రెండు రాష్ట్రాలకు ఎంత నీరు విడుదల చేయాలనే నిర్ణయాలు తప్ప సమస్యల పరిష్కారంవైపు బోర్డు వెళ్లలేదు. బోర్డు ఏర్పాటు వలన రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. అనేక సార్లు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును పక్కనపెట్టి రెండు రాష్ట్రాలు నీటి పథకాలను ప్రకటించటం ప్రారంభించాయి. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి నీరు అందించేందుకు ఎపి ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రకటించిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విస్తరణ, సంగమేశ్వర, హంద్రీనీవా పథకాల పూర్తికి నిర్ణయించటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్ట్, పాలమూరు- రంగారెడ్డి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, నెట్టింపాడు ప్రాజెక్టుల నిర్మాణం గురించి మాట్లాడుతున్నది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నీటి పంపకం చేయాలని, పాత పంపకాలను పక్కన పెట్టి 50:50% నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నది.

ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. మోడీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రతిపాదనకు అమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన 6 -అక్టోబర్ 20-23 జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్ -2 కు అప్పగించటం జరిగింది. విభజన చట్టంలోని సెక్షన్ 5(1) (నియమిత తేదీ నుంచి 10 సంవత్సరాలకు మించని కాలానికి నిర్ణయం) కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌కు విభజన సెక్షన్‌లోని 89కి లోబడి ఈ బాధ్యత అప్పగించినట్లు మంత్రివర్గం పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ చట్టపరమైన అభిప్రాయాల సేకరించడంతోపాటు, అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 సెక్షన్ (3)కి లోబడి పరిష్కారం చేస్తుందని చెప్పింది.

తెలంగాణ ప్రతిపాదనను ఆమోదించకుండా ట్రిబ్యునల్ -1 ప్రకారమే నీటి పంపకాలు జరుగుతాయని చెబుతూ వచ్చిన మోడీ ప్రభుత్వం అకస్మాత్తు కృష్ణా జలాల పరిష్కార బాధ్యత కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్- 2కి అప్పగించటం వెనక 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లబ్ధ్ది పొందటం కోసమే! ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ కృష్ణా జలాల పంపకం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అభిప్రాయ రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. దీన్ని గమనించిన మోడీ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనం కోసం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని ట్రిబ్యునల్ 2కి అప్పగించింది. కేంద్ర నిర్ణయాన్ని నాటి కెసిఆర్ ప్రభుత్వం స్వాగతించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణా నది నీటి పంపకాల విషయంలో మోడీ ప్రభుత్వ వివక్షను, విభజించే విధానాలను అర్థం చేసుకోవాలి. గోదావరి, కృష్ణా నదుల నీటిని రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఏర్పడిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్‌ను నాలుగు రాష్ట్రాలకు వర్తింపచేయాలని ప్రజలు సమష్టిగా డిమాండ్ చేయాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News