Tuesday, January 21, 2025

మయన్మార్‌లో జుంటా పతనం..

- Advertisement -
- Advertisement -

మయన్మార్ విషయంలో భారతదేశం తన విధానాన్ని తిరిగి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భారత దేశానికి ఈశాన్య ప్రాంతం భద్రతతో పాటు మయన్మార్‌తో సంబంధం ఉన్న ప్రాజెక్టుల కనెక్టివిటీకి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఎంతో ముఖ్యం. మయన్మార్‌లోని అరాకన్ ఆర్మీ మయన్మార్ బంగ్లాదేశ్‌ల మధ్యగల దాదాపు 270 కిలోమీటర్ల సరిహద్దుపై పట్టు సాధించింది. రోహింగ్యా కమ్యూనిటీ కూడా అరాకన్ ఆర్మీకి మద్దతు ఇస్తుండడంతో ఈశాన్య భారతం -బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దుల్లో మరో కొత్త దేశం ఆవిర్భవించే సూచనలు కన్పిస్తున్నాయి. తొలిసారిగా మయన్మార్‌లోని జుంటా సర్కార్ మయన్మార్, -బంగ్లాదేశ్‌లను విభజించే 270 కిలోమీటర్ల భూభాగంపై పట్టుకోల్పోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా అరాకన్ ఆర్మీ కంట్రోల్‌లో ఉంది.
బార్డర్ గార్డ్ పోలీస్ 5 లేదా బిజిపి 5 అనేది మయన్మార్ జుంటా సైన్యం స్థావరం. బంగ్లాదేశ్‌తో మయన్మార్‌కు గల సరిహద్దుల్లో కీలక నార్నర్న్ రఖైన్ స్టేట్ ఈ ప్రదేశంలో ఉంది. బిజిపి 5 ఆర్మీ ఈ ప్రాంతంలో గతంలో ముస్లిం రోహింగ్యా గ్రామం మోయ తు గ్యీ లో తిష్టవేసింది. 2017 లో మయన్మార్ జుంటా సైనిక దళాలు రోహింగ్యాలపై సాగించిన దారుణ మారణకాండలో ఈ గ్రామం తగులపడిపోయింది. రోహింగ్యాలు పరారయ్యారు. ఆ ఏడాది సెప్టెంబర్ సైన్యం తగులపెట్టిన గ్రామాలలో ఈ గ్రామం మొదటిది. సైన్యం సాగించిన మారణకాండలో చాలా మంది చనిపోగా, ఎందరో రోహింగ్యాలు పరారైపోగా.. ఆ అవశేషాలు గ్రామంలో ఇప్పటికీ ఉన్నాయి.
అరాకన్ ఆర్మీ మయన్మార్‌లో సైన్యంపై సాగించిన సాయుధ పోరాటం కారణంగా బిజిపి 5 వారి స్వాధీనం అయింది. 2009లో ఏర్పడిన అరాకన్ ఆర్మీ.. మయన్మార్ లో ఆవిర్భవించిన బలమైన తిరుగుబాటు గ్రూప్‌లలో కీలకమైంది. రఖైన్ స్టేట్‌లోని యువకులు దీనికి బలం ఒకప్పుడు చైనా సరిహద్దుల్లోనూ దేశం ఇతర ప్రాంతాలలోనూ పనుల కోసం వలసపోయిన రఖైన్ స్టేట్ యువకులు అరాకన్ ఆర్మీలో కీలకం అయ్యారు. అరాకన్ ఆర్మీలోని మూడు సాయుధ గ్రూప్‌లలో కీలక భాగస్వామి అయింది. ఈ కూటమి వల్లనే గత సంవత్సరం మయన్మార్ జుంటా ఎన్నో ఓటములను ఎదురు చూసింది. ఈ కూటమిలోని మరో రెండు సభ్యులైన సాయుధ గ్రూప్‌లు సరిహద్దుల్లోనే షాన్ స్టేట్‌లో పట్టు సాధించాయి. కానీ, అరాకన్ ఆర్మీ 8 ఏళ్ల క్రితం రఖైన్ స్టేట్‌లో పట్టు సాధించి స్వయంపాలన కోసం గట్టి కృషి చేస్తోంది.

పేదరికం, ఒంటరితనం, రఖైన్ జనాభా మగ్గిపోతోంది. ఇది ప్రజలలో ఆగ్రహాన్ని రగిల్చింది. మయన్మార్ కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని వారు ఆగ్రహించారు. అరాకన్ ఆర్మీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పాలన సాగించేందుకు యత్నిస్తోంది. అయితే ఈ గ్రూప్ అక్కడి ప్రజలకు పూర్తిగా సొంతంగా ఆహారం, ఆవాసం కల్పించగలదా అన్నది అనుమానాస్పదమే. అరాకన్ ఆర్మీ రోహింగ్యా జనాభా విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 2017లో దాదాపు ఏడు లక్షల మంది రోహింగ్యాలను అప్పటి సైన్యం తరిమివేసింది. అయినా.. రఖైన్ స్టేట్‌లో ఇప్పటికీ ఆరు లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు.

అరాకన్ ఆర్మీ రోహింగ్యా మిలిటెంట్ గ్రూప్‌లతో పోలిస్తే.. క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. రోహింగ్యా గ్రూప్ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో విస్తరించి ఉన్నారు. అనూహ్యంగా రోహింగ్యాలు తమ మయన్మార్ మిలిటరీ పక్షం వహిస్తూ అరాకన్ ఆర్మీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. అరాకన్ ఆర్మీ, రోహింగ్యాలను వేధించడంలో సైన్యం ట్రాక్ రికార్డు ఒకే విధంగా ఉన్నా, అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న పట్టణాల నుంచి రోహింగ్యాలను వెళ్లగొట్టడం ఓ కారణం. అలాగే, అలా వెళ్లగొట్టిన రోహింగ్యాలను అరాకన్ ఆర్మీ వెనక్కి అనుమతించకపోవడం మరో కారణం. అరాకన్ ఆర్మీ తమ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో అన్ని కమ్యూనిటీలకూ స్థానం కల్పిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే, రోహింగ్యాలు సైన్యం పక్షాన వహించి పోరాడడాన్ని నిరసిస్తోంది. ఆగస్టులో చాలా మంది రోహింగ్యాలు చాలా మంది మహిళలు, పిల్లలతో బంగ్లాదేశ్‌కు పరారయ్యేందుకు యత్నించగా అరాకన్ ఆర్మీ సైనిక స్థావరాల నుంచి, డ్రోన్ల ద్వారా బాంబులు విసిరి చంపివేసింది.

గత చరిత్ర చూస్తే.. రఖైనా గిరిజనులు మొదటి నుంచి మయన్మార్ జుంటా సైన్యానికి మద్దతుగా నిలిచి, రోహింగ్యాలపై మారణకాండలో పాల్గొన్నవారే. ప్రస్తుతం రోహింగ్యాలు, అరాకన్ ఆర్మీ సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి. మయన్మార్‌లోని రఖైన్ స్టేట్ లో కార్యకలాపాలు సాగిస్తున్న తిరుగుబాటు అరాకన్ ఆర్మీ బంగ్లాదేశ్ సైన్యంతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ రెండో వారంలో మాంగ్ డావ్ పతనం తర్వాత ఈ సంబంధాలు హెచ్చాయి. అరాకన్ ఆర్మీ బంగ్లా నుంచి సరఫరాలు పొందేందుకు కృషి చేస్తోంది. మరో పక్క బంగ్లాదేశ్ ఆర్మీలోని 10వ ఇన్ఫెంట్రీ డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు, అరాకన్ ఆర్మీ ప్రతినిధులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నా… రోహింగ్యా జనాభాకు సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలని అరాకన్ ఆర్మీకి సూచిస్తున్నారు.

డిసెంబర్ 19న బ్యాంకాక్‌లో థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, లావోస్, కంబోడియాకు చెందిన విదేశాంగ మంత్రిత్వశాఖల అధికారుల సమావేశం అనంతరం బంగ్లాదేశ్ సైన్యం అరాకన్ ఆర్మీతో ఫీల్ స్థాయిలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. బంగ్లాదేశ్ సెక్యూరిటీ ముఖ్యంగా రోహింగ్యాలకు సేఫ్ జోన్ ఏర్పాటు పైనే పట్టుపడుతున్నారు. గత డిసెంబర్‌లో మంగ్ డావ్ పతనం తర్వాత అరాకన్ ఆర్మీ నాఫ్ నది దాటి బంగ్లాదేశ్ భూభాగంలో ప్రవేశించి తిరిగి రఖైన్ స్టేట్‌లోని తన స్థావరాలకు తిరిగి రావడం విశేషం.

మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూప్‌లు విజృంభించడంతో చైనా ఆ దేశం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. మయన్మార్‌లో చైనా ప్రైవేట్ ఆర్మీ ఆపరేషన్లను ప్రారంభించేందుకు అనుమతించాలని జుంటాను చైనా కోరింది. మయన్మార్ జుంటా ఇప్పటికీ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. నాలుగు ఏళ్లుగా మయన్మార్ తిరుగుబాటు ముఠాలను ప్రతిఘటిస్తూ మయన్మార్, చైనా సరిహద్దుల్లోని కీలక ప్రదేశాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రాంతాలతో సహా దేశంలో సగం ప్రాంతంపై తన అదుపులో నిలుపుకోగలిగింది. కానీ గత 12 నెలలుగా జుంటా సైన్యం పలు తిరుగుబాటు దళాల చేతిలో ఓటమి పాలు కావడం చాలా ప్రాంతాలు కోల్పోవడం చైనాకు ఆందోళన కల్గిస్తోంది.

మయన్మార్‌లో చైనా వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి వ్యూహాత్మక ఆస్తులను సమకూర్చుకుంది. వాటిలో చైనా మయన్మార్ పైప్‌లైన్ ప్రాజెక్టు ఒకటి. ఈ పైప్‌లైన్ ద్వారానే చైనాకు మయన్మార్ నైరుతి ప్రాంతంలోని ప్రావిన్స్‌ల నుంచి గ్యాస్, ఆయిల్ సరఫరా అవుతుంది. 2021 ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత చైనా తన సంబంధాలను నిలుపుకు నేందుకు నానాతంటాలు పడుతోంది.

నిజానికి మయన్మార్‌లోని అల్లకల్లోల పరిస్థితి నేపథ్యంలో వివిధ వర్గాలతో చైనా కీలకమైన పవర్ బ్రోకర్‌గా వ్యవహరిస్తోంది. మయన్మార్‌లో అంతర్గత యుద్ధం నడుస్తుంటే.. ఒక పక్క మిలిటరీ జుంటాకు అవసరమైన ఆయుధాలు సరఫరా విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. మయన్మార్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. చైనా అధికారులు తరచు మయన్మార్ సందర్శిస్తున్నారు. కాగా, మయన్మార్ 2025లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ, సాయుధ తిరుగుబాటు గ్రూప్‌లో సైన్యంతో కాల్పుల విరమణకు కృషి చేయాలని సూచిస్తోంది.

అరాకన్ ఆర్మీ మయన్మార్‌లోని రఖైన్, ఛిన్ స్టేట్‌లలోని కీలక ప్రాంతాలపై పట్టు సాధించడం భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు భంగకరంగా మారింది. వాటిలో కీలకమైనది 484 -మిలియన్ అమెరికా డాలర్లతో చేపట్టిన కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు ఈశాన్య భారతంలో కీలక రాష్ట్రాలను కలుపుతూ, మయన్మార్‌లోని కోస్తా స్టేట్‌ల మీదుగా సాగుతుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ సమగ్రతకు ఇది సవాలుగా పరిణమిస్తోంది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన విధానంలో ఇది మూలస్తంభం. కెఎటిటిపిప్రాజెక్టు వల్ల ఆగ్నేయాసియాలో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలలు పెంపొందుతాయి. ఇది సిలిగురి కారిడార్‌కు ప్రత్యామ్నాయం కాగలదు. ఇది ప్రాంతీయ సహకారం, కనెక్టివిటీకి సంబంధించి భారతదేశం చిత్తశుద్ధికి అద్దంపడుతుంది. మయన్మార్‌లో పెరుగుతున్న సంఘర్షణతో ఈ ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. ప్రాజెక్ట్ పూర్తి, భవిష్యత్తు కార్యాచరణ నేపథ్యంలో భారతదేశం తన విధానాన్ని పునఃపరిశీలించాలని మయన్మార్ పిలుపునిచ్చింది. దీంతో భారతదేశం తన ప్రాంతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగా మారింది.

1990 నుంచి మయన్మార్ విషయంలో భారతదేశం విధానం కీలకంగా మారింది. పొరుగుదేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కంటే భద్రత, రాజకీయ ప్రయోజనాల విషయంలో గట్టి కృషి చేయాలని సూచిస్తోంది. మయన్మార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా రఖైన్ స్టేట్‌లో పరిస్థితులు, అరాకన్ ఆర్మీ ప్రకటనల నేపథ్యంలో భారతదేశం క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. మయన్మార్ విషయంలో తన విధానాన్ని పునరాలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది. మయన్మార్‌లో రాజకీయ సుస్థిరత ఏర్పడడం భారత దేశానికి ఎంతో కీలకం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలు, కీలక ప్రాజెక్టుల కనెక్టివిటీకి ఇది ఎంతో అవసరం. కెఎంటిటిపి ప్రాజెక్టు ముందుకు సాగడం. ప్రాంతీయ కనెక్టివిటీ మాత్రమే కాదు. మయన్మార్‌లో చైనా ప్రభావాన్ని తగ్గించడం, ఈశాన్య ప్రాంతంలో స్థిరత్వాన్ని పెంపొందించడానికి భారత దేశానికి వ్యూహాత్మక కీలకమైన అంశం.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News