Tuesday, January 21, 2025

ఉద్యమంతో దిగివచ్చిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

దాదాపు గత ఏడాదిగా రైతులు తమ డిమాండ్ల సాధనకు సాగిస్తున్న ఉద్యమానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి ఎస్‌కెఎం, కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్ల కింద రైతులు పంజాబ్ హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు సాగిస్తున్నారు. అయితే సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) కన్వీనర్‌గా ఉన్న జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ (70) గత నవంబర్ 20 నుంచి ఎలాంటి కనీస వైద్యసాయం అందకుండా నిరాహార దీక్ష కొనసాగించడం కేంద్ర వెన్నులో చలిపుట్టించింది. అంతే రైతులు గత ఏడాది కాలంగా సాగిస్తున్న ఉద్యమానికి ఇప్పుడు కేంద్రం నుంచి కదలికి రావడం చూస్తుంటే ఇన్ని నెలలుగా రైతులంటే కేంద్ర దృష్టిలో ఎంత చులకనగా ఉన్నారో తెలుస్తుంది. క్షీణస్తున్న ఆయన ఆరోగ్యంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.

గత డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో మూడు తేదీల్లో తీసుకున్న దల్లేవాల్ రక్తనమూనాల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. దల్లేవాల్ నిరాహార దీక్షలో కొనసాగుతున్నా ఆయన ఆరోగ్య పారామితులు ఎలా మెరుగుపడుతున్నాయని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు నుండి అభిప్రాయం కోసం అతని ఆరోగ్య నివేదికల కాపీని పరిశీలించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. దల్లేవాల్‌ను తాత్కాలిక ఆస్పత్రికి మార్చేలా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2 లోగా ఆయనకు ఎలాగైనా వైద్య సాయం అందించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చినా ఫలించలేదు. దల్లేవాల్ నిరాహార దీక్ష ఎక్కడా ఆగలేదు. దీంతో ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు రావాలంటూ కేంద్రం ఆహ్వానించడం చెప్పుకోదగ్గ పరిణామం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ప్రియరంజన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు దల్లేవాల్‌ను, సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులను కలుసుకుని చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో గత 55 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష సాగిస్తున్న తమ సంయుక్త కిసాన్‌మోర్చా కన్వీనర్ జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ (70)ను కనీస వైద్యం పొందేందుకు రైతులంతా కలిసి బలవంతంగా ఒప్పించారు.

దల్లేవాల్‌కు సంఘీభావంగా నిరాహార దీక్షలు సాగిస్తున్న 121 మంది రైతులు కూడా తమ దీక్షలను విరమించారు. అయితే దల్లేవాల్ కూడా దీక్ష విరమించినట్టే అని అనుకోరాదు. తాము కోరుతున్న డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేయడం ఈ సందర్భం గా గమనార్హం. అలాగే జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం చర్చలకు పంపిన ఆహ్వానంపై రైతులు ఒక విజయంగా భావించడం లేదు. కానీ మూసుకున్న కేంద్ర ప్రభుత్వ తలుపులను తెరిపించగలిగాం అని పంజాబ్ రైతులు వ్యాఖ్యానించారు. ఇంతవరకు అన్నదాతల ఆందోళనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పైగా ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కివేయడానికి కేంద్రం ఎంతగా ప్రయత్నించిందో, ఉద్యమకారులను దేశద్రోహులుగా నేరస్తులను చేసి జైళ్లలో ఎలా మగ్గబెట్టిందో అందరికీ తెలిసిందే.

లాఠీఛార్జీ, బాష్పవాయు ప్రయోగం, బారికేడ్లతో అడ్డంకులు, అరెస్టులు, అక్రమ కేసులు బనాయింపులు జరిగాయి. దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్షను నీరుకార్చడానికి కేంద్రం ప్రయత్నించింది. రైతులను బుజ్జగించడానికి ఇటీవల డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువుపై అదనపు రాయితీ కింద రూ. 3850 కోట్ల వరకు వన్‌టైమ్ ప్యాకేజీగా ఇవ్వడానికి నిర్ణయించినట్టు గొప్పగా చెప్పుకొంది. అయినా రైతులకు ఉపశమనం కలగలేదు. వ్యవసాయానికి ఎరువులు ఎంత అవసరమో, పంటలు పండిన తరువాత వాటికి గిట్టుబాటు ధర కల్పించడం కూడా అంతే అవసరం. పంటలు అమ్ముడుపోనప్పుడు ఎన్ని ఎరువులు వేసి, ఎన్ని రుణాలు ప్రభుత్వం అందించినా రైతుకు మేలు చేయదు సరికదా నిరాశా నిస్పృహలకు దారి తీస్తుంది. పంట అన్నది రైతుల కష్టఫలం. ఇందులో అన్యాయం జరిగితే రైతు బతుకు నిలవదు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు దల్లేవాల్ నిరసన దీక్ష కొనసాగుతుందని సుప్రీం కోర్టుకు కూడా రైతు నాయకులు చెప్పారు. ఒకవంక రైతులను చర్చలకు కేంద్రం ఆహ్వానించినా కేంద్రంపై రైతునాయకులకు పూర్తి విశ్వాసం కలగడం లేదు.

ఎందుకంటే మరోవంక మళ్లీ దొడ్డిదారిన ఆ మూడు చట్టాలను తిరిగి అమలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోందని తెలుస్తోంది. ఈ చట్టాలపై కొత్తగా అభిప్రాయాల సేకరణకు అన్ని రాష్ట్రాలకు కొత్త పాలసీ కాపీలు పంపారని ఆమ్‌ఆద్మీ చీఫ్, మాజీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ముసాయిదా పాలసీని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం మూడు వ్యవసాయ చట్టాలను ఎలాగోలా అమలు చేయాలన్నదే కేంద్ర యంత్రాంగం తంత్రం. ఇదిలా ఉండగా రైతులు తమ డిమాండ్ల సాధనే ప్రధాన లక్షంగా ముందుకు సాగుతున్నారు. ఫిబ్రవరి 14న ప్రభుత్వంతో చర్చలు జరిపేటప్పుడు రైతులకు రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఇంతేకాకుండా కేంద్రం ప్రభుత్వం గతంలో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News