పాట్నా : శాసనసభల గౌరవం పరిరక్షణ నిమిత్తం రాజకీయ పార్టీలు తమ శాసనకర్తలకు ఒక ప్రవర్తన నియమావళిని నిర్దేశించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా మంగళవారం పిలుపు ఇచ్చారు. పాట్నాలో 85వ అఖిల భారత సభాపతుల సమ్మేళనం ముగింపు సెషన్‌లో ఓమ్ బిర్లా ప్రసంగిస్తూ, రెండు రోజుల సంప్రదింపుల అనంతరం చర్చకు ప్రధాన కేంద్రంగా శాసనసభలను చేయాలని సభాపతులు తీర్మానించారని తెలియజేశారు. ‘శాసనసభల గౌరవం పరిరక్షణలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. రాజకీయ పార్టీలు తమ శాసనకర్తల కోసం ప్రవర్తన నియమావళిని రూపొందించినపప్పుడే ఇది సాధ్యం అవుతుంది’ అని బిర్లా స్పష్టం చేశారు. పలు శాసనసభలలో పదే పదే అంతరాయాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీ వినియోగం ద్వారా శాసనసభల పని తీరులో మరింత సామర్థాన్ని తీసుకురావలని కూడా సభాపతులు తీర్మానించినట్లు లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటరీ చర్చలను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్‌లో గుర్తించిన 22 భాషల్లో పార్లమెంట్ త్వరలో అందుబాటులోకి తీసుకురాగలదని బిర్లా ప్రకటించారు. శాసనసభలు కూడా 1947 నుంచి జరిగిన చర్చలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇందు కోసం పార్లమెంటరీ సెక్రటేరియల్ నుంచి సాంకేతిక సహాయం అందజేయగలమని ఆయన హామీ ఇచ్చారు. అఖిల భారత సభాపతుల సమ్మేళనం ముగింపు సెషన్‌క బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా. బీహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్, బీహార్ శాసన మండలి చైర్మన్ అవధేశ్ నారాయణ్ సింగ్ ప్రభృతులు హాజరయ్యారు.