Wednesday, January 22, 2025

బిజెపి మేనిఫెస్టో ‘ప్రమాదకరం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలు ‘దేశానికి ప్రమాదకరం’ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం అభివర్ణించారు. ఆ పార్టీ ఉచిత ఆరోగ్య సేవలకు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యకు స్వస్తి పలకాలని అనుకుంటున్నదని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, బిజెపి మేనిఫెస్టోల్లో తన ‘అసలు ఉద్దేశాలు’ వెల్లడించిందని ఆరోపించారు. ఆ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని వోటర్లను ఆయన హెచ్చరించారు. ‘బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే అది ఉచిత విద్యను, ఉచిత ఆరోగ్య సేవలను నిలిపివేస్తుంది. ఢిల్లీలో మనుగడను పేదలకు కష్టసాధ్యం చేస్తుంది. అది సామాన్యుని సంక్షేమంపై ప్రత్యక్ష దాడే’ అని ఆయన అన్నారు.

బిజెపి క్రితం వారం విడుదల చేసిన తన తొలి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, ప్రతి గర్భిణికి రూ. 21 వేలు ఆర్థిక సాయం, రూ. 500 ధరకు ఎల్‌పిజి సిలిండర్లు సరఫరా, వృద్ధులకు రూ. 2500 పింఛన్ గురించి వాగ్దానం చేసింది. మంగళవారం విడుదల చేసిన రెండవ మేనిఫెస్టోలో మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ పలు ఆశావహ పథకాలు ప్రకటించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన విద్యార్థులకు కెజి నుంచి పిజి స్థాయి వరకు ఉచిత విద్య సౌకర్యం కల్పన కూడా వాటిలో ఉన్నది. యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్, రాష్ట్ర పిసిఎస్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు రెండు ప్రయత్నాల వరకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కూడా బిజెపి ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన విద్యార్థులకు ఉచిత విద్య అందజేయనున్నట్లు తన మేనిఫెస్టోలో రాసినందుకు కాషాయ పక్షాన్ని కేజ్రీవాల్ ఆక్షేపిస్తూ, విద్యార్థులు అందరికీ ఆ సౌకర్యాన్ని నిలిపివేయాలన్నది బిజెపి ప్లాన్ అని అది స్పష్టం చేస్తోందని అన్నారు. ‘బిజెపి మేనిఫెస్టో ఉచిత విద్యను ‘అవసరమైన’ విద్యార్థులకే పరిమితం చేస్తోంది. అంటే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లకు ఉచిత విద్య సదుపాయం కోసం తమ నేతల వెంట పడవలసి ఉంటుందన్నమాట. అది వారి అసలు ఉద్దేశం. అందరికీ ఉచిత విద్యను నిలిపివేయాలన్నది వారి అభిమతం’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. తమ పార్టీ పాలన కింద ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న ఉచిత విద్య వల్ల 18 లక్షల మంది పిల్లలు ప్రస్తుతంలబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. ఆ పిల్లలకు అందజేస్తున్న ఉచిత విద్యను బిజెపి పథకం ఆపివేస్తుందని ఆయన ఆరోపించారు.

బిజెపి తన తొలి మేనిఫెస్టోలో మొహల్లా క్లినిక్‌ల మూసివేత ప్లాన్లను ప్రకటించిందని, అలా చేయడం వల్ల కుటుంబాలపై అదనపు వ్యయ భారం పడుతుందని, ఎందుకంటే భారీ మొత్తాలు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలపై వారు ఆధారపడవలసి వస్తుందని కూడా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మధ్య తరగతి, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల ఆర్థిక సుస్థిరతను బిజెపి ప్రతిపాదనలు దెబ్బ తీస్తాయని ఆయన వాదించారు. బిజెపి విడుదల చేసిన రెండు మేనిఫెస్టోలు కేవలం ఢిల్లీకి కాకుండా మొత్తం దేశానికి ‘ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ పాలన కింద అత్యవసర సేవల సమాన లభ్యతలో సాధించిన పురోగతిని అవి వెనుకబాట పట్టిస్తాయని ఆయన అన్నారు.

‘వారు తమ అసలు ఉద్దేశాలు, ధ్యేయాలను నిజాయతీగా ఒప్పుకున్నందుకు నాకు ఆనందంగా ఉన్నది. అయితే, ఆ మేనిఫెస్టోలను చదివినవారు ఎవరైనా ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఢిల్లీలో విద్యను ఉచితం చేశామని మేము పదే పదే చెప్పాం. నిరుపేద కుటుంబాల పిల్లలకు అద్భుతమైన విద్య గరపేందుకు మేము ఏర్పాట్లు చేశాం. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యను, ఉచిత ఆరోగ్య సేవలను నిలిపివేస్తామని బిజెపి ఇప్పుడు చెబుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. బిజెపికి వోటు వేయవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వారి విధానాలు దేశ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని, ఢిల్లీలోని నిరుపేదల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని కేజ్రీవాల్ అన్నారు. కాగా, కేజ్రీవాల్ ఆరోపణలకు బిజెపి ఇంకా స్పందించవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News