ఇండోనేషియాకు చెందిన జావా ద్వీపంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డం చోటుచేసుకోవడంతో 17 మంది చనిపోయారని, ఎనిమిది మంది గల్లంతయ్యారని అధికారులు మంగళవారం తెలిపారు. చనిపోయిన వారి మృత దేహాలను ఇండోనేషియా రెస్కూయర్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కుండపోత వర్షాలు కురియడంతో నదులు పొంగి చెలియలి కట్టలను దాటి పేకలోంగన్ రీజెన్సీలోని తొమ్మిది గ్రామాలను ముంచెత్తాయి. కొండప్రాంతంలోని కుగ్రామాలలో బురద, బండరాళ్లు, చెట్లు విరుచుకుపడ్డాయి. గల్లంతయిన ఎనిమిది మంది గ్రామస్థుల కోసం రెస్కూయర్లు ఇంకా వెతుకుతున్నారని స్థానిక విపత్తు నివారణ మేనేజ్‌మెంట్ సంస్థ అధిపతి బెర్గాస్ కెటుర్‌ససి తెలిపారు.
వరదలకు బాగా దెబ్బ తిన్న పెటంగక్రియోనో గ్రామం నుంచి 17 మంది మృత దేహాలను రెస్కూయర్లు వెలికి తీశారని కూడా ఆయన వివరించారు. పోలీసులు, సైనికులు, రెస్కూ వర్కర్లు తవ్వకాల యంత్రాలను ఉపయోగించి తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలను టివి రిపోర్టులు చూయించాయి. ఆకస్మిక వరదలు గ్రామస్థులను, వాహనాలను కొట్టుకుపోయేలా చేశాయని, అంతేకాక రెండు వంతెనలను ధ్వంసం చేశాయని జాతీయ విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహరి తెలిపారు. అక్టోబర్ నుంచి మార్చి మధ్య కురిసే వానలు ఇండోనేషియాలో వరదలకు, కొండచరియలు విరిగిపడ్డానికి కారకమవుతాయి. ఇండోనేషియా 17000 ద్వీపాల సమూహ దేశం. అక్కడ లక్షలాది మంది ప్రజలు కొండ ప్రాంతాల్లో లేక సారవంత వరద మైదానాల్లో నివసిస్తుంటారు.