Wednesday, January 22, 2025

మాజీ ఎంఎల్‌ఎ భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన రైతు మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీల చించివేతపై గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా రైతులకు అందకపోవడంపై నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం జరగాల్సిన రైతు మహా ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వని విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ఈ నెల 27కు ఈ కేసు వాయిదా వేసింది. రైతు మహాధర్నాకు సంబంధించి నల్లగొండలో భారీ ఎత్తున బిఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఫ్లెక్సీలను ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపు విషయమై మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ కార్యాలయంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏమైనా నిరసన తెలపాలని అంటే కార్యాలయం బయట చేయాలని, కానీ కమిషనర్ చాంబర్లు చేయకూడదని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడికి భారీగా చేరుకున్న బిఆర్‌ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ , బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడి వస్తువులు, పూల కుండీలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే విషయమై మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ..మాజీ ఎంఎల్‌ఎ తమ కార్యకర్తపై, తమ మంత్రిపై అసభ్య పదజాలం వాడారని ఆరోపించారు.

ఏమాత్రం పరిణితి లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని,తమ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తే తప్పక ప్రతి దాడి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్ ఉన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందని బిఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్…
తమ మున్సిపల్ సిబ్బందిపై మాజీ ఎంఎల్‌ఎ, ఆయన అనుచరులు అసభ్య పదజాలం వాడుతూ.. తమ విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తమ సిబ్బంది అంతా ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఉన్నామని, అనుమతి లేకుండా తన ఛాంబర్‌లోకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దూసుకువచ్చారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News