ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ హు)కు చైనా మంగళవారం గట్టి మద్దతు ప్రకటించింది. కొవిడ్19 సంక్షోభం విషయంలో యుఎన్ ఆరోగ్య సంస్థ వ్యవహరించిన తీరును, సంస్కరణలు తీసుకురావడంలో వైఫల్యాన్ని తప్పుపట్టుతూ ఆ సంస్థ నుంచి యుఎస్ ఉపసంహరించుకుంటున్నదని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డబ్లుహెచ్‌ఒ నుంచి అమెరికా ఉపసంహరణ ప్రక్రియకు నాంది పలుకుతూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణకు ఆదేశించడం ఐదు సంవత్సరాలలోపే రెండవ సారి.
ట్రంప్ నిర్ణయానికి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మంగళవారం స్పందిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ తన విధులు నిర్వర్తించడంలో చైనా మద్దతు కొనసాగిస్తుందని తెలియజేశారు. ప్రపంచ ప్రజారోగ్య రంగంలో అధీకృత అంతర్జాతీయ సంస్థగా డబ్లుహెచ్‌ఒ ప్రపంచ ఆరోగ్య బాధ్యతల నిర్వహణలో కేంద్ర సమన్వయ పాత్ర పోషిస్తుంటుందని, దాని పాత్రను పటిష్ఠం చేయాలి గానీ బలహీనపరచరాదని గువో అన్నారు. ట్రంప్ చాలా కాలంగా డబ్లుహెచ్‌ఒపై విమర్శలు చేస్తున్నారు. యుఎస్ అధ్యక్షునిగా తన మొదటి హయాంలో ఆ సంస్థ నుంచి యుఎస్ ఉపసంహరణను కోరారు. కానీ ఆయన వారసుడు జో బైడెన్ ఆ నిర్ణయాన్ని తిరగతోడారు.