ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో మంగళవారం భారీ స్థాయిలో సైనిక చర్య ప్రారంభించింది. ఆ దాడిలో కనీసం ఆరుగురు మరణించారని, 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జెనిన్ నగరంలో పాలస్తీనా తీవ్రవాదులపై ‘గణనీయ, విస్తృత సైనిక చర్య’ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ 2023 అక్టోబర్ 7న దాడితో గాజాలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇటీవలి సంవత్సరాల్లో జెనిన్‌లో పదే పదే ఇజ్రాయెలీ చొరబాట్లు, తీవ్రవాదులతో తుపాకులతో పోరాటాలు చోటు చేసుకున్నాయి.
గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే తాజా దాడి చోటు చేసుకున్నది. ఆ ఒప్పందం ఆరు వారాల పాటు సాగవలసి ఉండడమే కాకుండా ఇజ్రాయెలీ చెరలోని వందలాది మంది పాలస్తీనియన్ల విడుదలకు ప్రతిగా తీవ్రవాదుల వద్ద ఉన్న 33 మంది బందీలకు విముక్తి లభించవలసి ఉంది. ఇజ్రాయెల్ 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలెంలను ఆక్రమించుకున్నది. ఆ మూడు ప్రాంతాలు కలిపి స్వతంత్ర దేశాన్ని పాలస్తీనియన్లు కోరుతున్నారు.