Wednesday, January 22, 2025

అదే దూకుడు.. అదే తెంపరితనం!

- Advertisement -
- Advertisement -

దూకుడుతనానికీ, దుందుడుకు స్వభావానికి డొనాల్డ్ ట్రంప్ పెట్టింది పేరు. అలా ఉండటమే తనకు రెండోసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు కూడా. ‘మీరు సమర్థవంతమైన నాయకుడిగా ఎదగడానికి కారణమేమిటి?’ అని తాజాగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘నేను క్రేజీగా ఉండటమే’నంటూ ఆయన ఇచ్చిన సమాధానమే ఇందుకు ఉదాహరణ. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసీచేయగానే ట్రంప్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒకటి- పారిస్ ఒప్పందం నుంచి మళ్లీ బయటకు రావడం. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతానంటూ తొలి రోజు ప్రసంగంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ట్రంప్.. భూతాపానికి ముకుతాడు వేసేందుకు 190కి పైగా దేశాలు ఒక్కతాటిపైకి వచ్చి కుదుర్చుకున్న ఒడంబడికనుంచి వైదొలగడం ఎలాంటి సంకేతాలనిస్తుంది? అమెరికాకు తొలిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ ఈ ఒప్పందంనుంచి వైదొలగడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి.

కీలకమైన పారిస్ ఒప్పందం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న బైడెన్, తాను అధికారంలోకి వచ్చాక 2021లో మళ్లీ ఒప్పందంలో అమెరికాను చేర్చారు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా వాదించే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కాగానే ఈ ఒప్పందాన్ని కాలరాచేందుకు ఉద్యుక్తుడయ్యారు. అంతేకాదు, కొవిడ్ వ్యాప్తి సమయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందనే ఆగ్రహంతో ప్రపంచ ఆరోగ్య సంస్థనుంచి కూడా వైదొలగుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం తెంపరితనం కాక మరేమిటి? కృత్రిమ మేధ విస్తరిస్తే మనవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, బైడెన్ ప్రభుత్వం దీని విస్తరణపై విధించిన ఆంక్షలను తాజాగా ట్రంప్ తొలగించారు. కీలకమైన అంశాలపై లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలు.. ఏవీ లేకుండా వచ్చీరాగానే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం ఆయన తొందరపాటుకు నిదర్శనమనే చెప్పాలి. పదవిలోకి రాకముందే హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలికారనే ఘనతను ట్రంప్ దక్కించుకున్నారు. ఆయన హెచ్చరికలవల్లే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ దిగి వచ్చారని విశ్వసించేవారు ఎంతోమంది ఉన్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ట్రంప్ చరమాంకం పలుకుతారని ఆయన అనుయాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది నిజమే అనుకున్న పక్షంలో, ఒకవైపు యుద్ధ విరమణకు కృషి చేస్తూ, మరోవైపు గ్రీన్‌లాండ్‌నూ, పనామా కాలువనూ స్వాధీనం చేసుకుంటామంటూ తొలిరోజే రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేసిన ట్రంప్ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. తొలిసారి మాదిరిగానే ఈసారి కూడా ట్రంప్ ప్రసంగం దూకుడుగా, తన మద్దతుదారులు, దేశప్రజలలో ఉత్సాహం నింపేదిగా సాగింది. ‘అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది. మునుపెన్నడూ లేనంత దృఢమైన, పటిష్ఠమైన, అసాధారణమైన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతా’నంటూ ఆయన అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రతినబూనారు. మొదటిసారికంటే ఈ తడవ మరింత శక్తిమంతమైన నేతగా ట్రంప్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీ బలం రిపబ్లికన్ పార్టీదే కావడం ఇందుకు కారణం. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే మోడీ- జో బైడెన్ హయాంలో ఇరుదేశాల మధ్య బంధం మున్నెన్నడూ లేనంతగా బలోపేతమైందనేది జగద్విదితం.

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడన్న నానుడిని నిజం చేస్తూ ఇరు దేశాలకూ పక్కలో బల్లెంలా మారిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు బలపడటానికి కారణమైంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, భారత్ ఉత్పత్తులపైనా అదే విధంగా సుంకాలు విధించే అవకాశం ఉండవచ్చు. అంతమాత్రానికే, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడతాయని భావించరాదు. ట్రంప్ విదేశాంగ విధానంలో కొంత గందరగోళం ఉంటుందన్నది విస్పష్టం. ఇందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత దౌత్యంతో ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ, అమెరికాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదిగుతున్న చైనా మెడలు వంచడం అనుకున్నంత సులభమేమీ కాదు. ట్రంప్ దుందుడుగు స్వభావాన్ని పసిగడుతూ భారత్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను పదును పెట్టుకోవలసిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News