హైదరాబాద్: మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజా తిరుగుబాటు మొదలైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు.
గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయిందని, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు స్వరూపం బట్టబయలైందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలు రసాభస, ఉద్రిక్తంగా మారడంతో కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇక కాలయాపనతో కాలం సాగదని, అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని చురకలంటించారు. ఈ దరఖాస్తుల దందా నడవదని, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదని, నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదని హెచ్చరించారు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామసభల సాక్షిగా చెబుతున్నానని, గ్రామసభలా…ఖాకీల క్యాంప్ లా? అని కెటఆర్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసమా? కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!? అని అడిగారు. ఖాకీల దౌర్జన్యాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు నడుస్తున్నాయని, పోలీసు పహారాలతో గ్రామలను నింపేసి గ్రామసభలలో ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘ఇదా మీరు చెప్పిన ప్రజా పాలనా?, ఇదా మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?.. పోలీసుల నడుమ, అంక్షల నడుమ, పథకాలకు అర్హుల గుర్తిస్తారటా, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన’ ఉందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.