న్యూఢిల్లీ : ‘బేటీ బచావో బేటీ పఢావో’ పథకం పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో లింత వివక్షలను అధిగమించడంలో అది కీలకం అయిందని, అదే సమయంలో విద్య, తన కలల సాకారానికి అవకాశాల కల్పన బాలికకు అందుబాటులో వచ్చేలా సరైన వాతావరణాన్ని అది సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వెల్లడించారు. బేటీ బచావో బేటీ పఢావో (బిబిబిపి) పథకాన్ని ప్రధాని 2015 జనవరి 22న హర్యానా పానిపట్‌లో ప్రారంభించారు. శిశు లింగ నిష్పత్తి (సిఎస్‌ఆర్) క్షీణతను అరికట్టడానికి, జీవన వలయంలో మహిళా సాధికారత సమస్యలు పరిష్కరించడానికి బిబిబిపి దోహదం చేస్తుంది. ‘ఇప్పుడు మనం బేటీ బచావో బేటీ పఢావో ఉద్యమానికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. గడచిన దశాబ్దంలో అది పరివర్తనాత్మక, ప్రజల సాధికార పథకంగ మారింది. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసింది’ అని మోడీ తెలిపారు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ పథకం లింగ వివక్షలను అధిగమించడంలో కీలకం అయిందని, అదే సమయంలో బాలిక విద్య సౌకర్యం, తన కలల సాకారానికి అవకాశాలు పొందేటా సరైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు.
‘ప్రజలు. వివిధ వర్గాల సేవా సంస్థలు అంకితభావంతో చేసిన కృషి ఫలితంగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ గణనీయమైన మైలురాళ్లు సాధించింది’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’లో తన పోస్ట్‌లో తెలియజేశారు. ‘చారిత్రకంగా స్వల్ప శిశు లింగ నిష్పత్తులు ఉన్న జిల్లాలు గణనీయంగా మెరుగుదలలను నమోదు చేశాయని, అవగాహన ప్రచారోద్యమాలు లింగ సమానత్వం ప్రాముఖ్యం భావనను పాదుకొల్పాయి’ అని మోడీ తెలిపారు. ‘అట్టడుగు స్థాయిలో ఈ ఉద్యమాన్ని చైతన్యభరితం చేసిన సంబంధిత వ్యక్తులు, సంస్థలను కొనియాడుతున్నాను. మన కుమార్తెల హక్కులను మనం ఇదే విధంగా కొనసాగిద్దాం, వారి విద్య కొనసాగేలా చూద్దాం, ఎటువంటి వివక్షా లేకుండా వారు మనుగడ సాగించగల సమాజాన్ని సృష్టిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘రానున్న సంవత్సరాల్లో భారత తనయలకు మరింత పురోగతి, అవకాశాలు లభించేలా మనం కలసి కట్టుగా కృషి చేద్దాం’ అని మోడీ సూచించారు.