యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 919 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సిఎస్‌ఇ) 2025 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యుపిఎస్‌సి సిఎస్‌ఇ 2025 పరీక్షకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాల ప్రకారం విద్యార్హతలు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులకు రూ. 100 ( మహిళలు, ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు ఫీజు మినహాయింపు) దరఖాస్తు రుసుంగా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ( 400 మార్కులకు )ఉంటాయి,. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఇస్తారు. ఈ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులకు ఇంటర్వూ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్ లో ఏర్పాటయ్యాయి. మెయిన్స్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ,ల్లో ఏర్పాటయ్యాయి.