ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తొలి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం దేశం అంతటి నుంచి వేలాది మంది భక్తులు రామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా విగ్రహానికి నిరుడు జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఆ మైలురాయి ఉత్సవం జరిగింది. గట్టి భద్రత ఏర్పాట్ల మధ్య శ్రీరాముని విగ్రహ దర్శనార్థం
బుధవారం సాయంత్రం పొద్దుపోయేంత వరకు ఆలయానికి వస్తూనే ఉండగా, ‘జై శ్రీరామ్’ పవిత్ర నినాదం మిన్నంటిందని అధికారులు తెలియజేశారు. ఇంతకు ముందు ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించింది. ఆ సమయంలో కూడా లక్షలాది మంది భక్తులు శ్రీరాముని దర్శనార్థం అయోధ్యకు వచ్చారు. బుధవారం వేలాది మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు.