పుట్టుకతో ఎవరూ ‘అనాథ’ కాదు. పరిస్థితులు తలకిందులై అనాథగా మనుగడ సాగించాల్సిన ఆవశ్యత ఏర్పడుతోంది. కళ్లుతెరవకుండానే పసికందులు మురుగుకాల్వల్లో ప్రత్యక్షమవుతున్నారు. చనుబాలు రుచి చూడకుండానే రక్తపు ముద్దగా ముళ్లపొదలో కనిపిస్తున్నారు. కారణాలు ఏవైతేనేం.. పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందులు ఎందరో అనాథలుగా మారుతున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, తెలిసీతెలియని వయసులో వేసిన తప్పటడుగులు, అనైతిక బంధాలు ప్రతిబంధకాలుగా మారటంతో కన్నబిడ్డలను వదిలించు కుంటుండడంతో అనాథలుగా జీవనం గడుపుతున్నారు.
‘అమ్మా’ అని పరితపించే పిల్లలు బాలకార్మికులు, భిక్షకులుగా, నేరాల రొంపిలోకి దిగి దుర్భరమైన జీవితాలను వెళ్ళదీస్తున్నారు. ఇంకొంతమంది అనాథాశ్రమాలలో తలదాచుకుంటున్నారు. సాధారణంగా వీరి వయసు ఐదు నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్లకుపైగా అనాథలుంటారని అంచనా. మన దేశంలో దశాబ్దం క్రితమే సుమారు రెండున్నర కోట్ల మంది అనాథలున్నట్లు అధికార గణాంకాలు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యం ఆరేడు వేల మంది పిల్లలు వీథుల పాలవుతున్నారు. వీరందరి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత. వీరి సంక్షేమం నీటి మీది రాతలా మారింది.
కనీస గుర్తింపులేకుండా జీవిస్తున్న అనాథలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాలని, వారి కోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. తల్లిదండ్రులెవరో, కులమేదో, మతమేదో, ప్రాంతమేదో తెలియక, నా అన్నవారు లేకుండా అభాగ్యులుగా బతుకుతున్న వీరిపట్ల మానవత్వంతో వ్యవహరించడం ప్రతి పౌరుడి విధి. అనాథల ఉద్ధరణ కోసం కొన్ని ప్రజాహిత బృందాలు, స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అయితే వారి సంక్షేమం కోసం వ్యవస్థీకృత మార్పుల దిశగా చట్టసభలలో మాట్లాడే గొంతుక లేకపోవడం బాధాకరం. కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలోగానీ, కెజి టూ పిజి వరకు ఉచిత విద్య, గురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ‘పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింది ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఆచరణకు నోచుకోలేదు.
చిన్నారుల పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ తెరవడం, పదేళ్లలోపు చిన్నారుల విద్యకోసం, ఉన్నత విద్య అవసరాల కోసం స్టయిఫండ్ అందివ్వడం, ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని వర్తంపజేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అనాథలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి హక్కుల సాధన కోసం అందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నం నాలుగేళ్ల క్రితం గాదె ఇన్నయ్య నేతృత్వంలోని ‘ఫోర్స్ ఫర్ అర్బన్ రైట్స్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ (ఫోర్స్)’ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎనిమిది దేశాల ప్రతినిధిలు, దేశంలోని 18 రాష్ట్రాల ఎన్‌జిఒ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనాథలకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆ దిశలో ప్రభుత్వాలు ముందుకు సాగలేదు. అనాథ పిల్లల సంక్షేమం కోసం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీవ్ ు(ఐసీపీఎస్)’ను ఏర్పాటు చేసినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు అరకొరగా ఉండి, వారి అవసరాలను తీర్చడం లేదు. అనాథ బాలలకు పునరావాసం కల్పించడం కోసం రూపొందించిన విధానాలను కాగితాలకు పరిమితం చేయకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు రెండేళ్ళ క్రితం ఆదేశించినప్పటికీ నిరాశే ఎదురవుతోంది.
అనాథ పిల్లల ఆలనాపాలనా చూసేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలు, బాలసదనాలు మనుగడలో ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న మన దేశంలో వీటి పనితీరు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కొన్ని అనాథాశ్రమాల్లో పిల్లలతో బిచ్చం ఎత్తించడం, వ్యభిచార కేంద్రాలకు తరలించడం, కనీస వసతులు కల్పించలేక మురికికూపాలుగా మారాయి. ట్రాఫిక్ కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రార్ధన మందిరాల సమీపంలో బిక్షమెత్తుకుంటూ 10 12 ఏళ్ల వయస్సున్న చిన్నారులు కాసులు కురిపించే వస్తువులుగా మారుతున్నారు. వీరిని గుర్తించి సంరక్షించాల్సిన మహిళా శిశుసంక్షేమ విభాగం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. అప్పుడప్పుడు స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాల్లో బాలకార్మికులను గుర్తించి సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. అనాథ బాలికలకు గుణాత్మక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. దేశవ్యాప్తంగా అరవై వేల మంది చిన్నారులు సంరక్షణ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా పది వేల మందికి తమిళనాడులోని కేంద్రాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద సంస్థాగత కేర్ హోవ్సులో ఉంటున్న పిల్లల సంఖ్య డిసెంబరు నాటికి తగ్గినప్పటికీ దేశవ్యాప్తంగా చైల్డ్‌కేర్ సంస్థల నెట్వర్క్ మరింత విస్తరించింది. తమిళనాడు వరుసగా మూడవ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో అనాథ పిల్లలకు కేర్ హోవ్సులో ఆశ్రయం కల్పించింది.
దక్షిణాది రాష్ట్రాల్లో 202122లో 13,877 మంది పిల్లలు కేర్ హోవ్సులో తలదాచుకోగా, 202223లో ఆ సంఖ్య 7,785కు తగ్గింది. గత ఏడాది తెలంగాణ కేర్ హోవ్సులో 2,243 మంది అనాథలు తలదాచుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథశ్రమాలు 182 వరకు ఉన్నాయి. అనధికారికంగా సుమారు 500 వరకు ఉన్నట్లు అంచనా. ఇవన్నీ కూడా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అయితే చాలావరకు అనాథశ్రమాలు అక్రమ మార్గాల్లో పయనిస్తున్నాయి. పిల్లలను ఎరవేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మన రాష్ర్టంలోని బాలసదనాలు (చిల్డ్రన్స్ హోం)కు పక్కాభవనాలు లేకపోవడంతో సమస్యలతో కూనరిల్లుతున్నాయి. తాత్కాలిక భవనాలు, స్వచ్ఛంద సంస్ధల నీడలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, భూకేటాయింపులు లేకపోవడంతో బాలసదనాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 35 బాలసదనాలు మంజూరు చేసింది. ఇందులో 33 బాలికలు, రెండు బాలురకు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సగానికిపైగా బాలసదనాలకు ఇప్పటికీ పునాదులు పడలేదు. మరికొన్ని నిధుల కొరతతో మధ్యలో ఆగిపోయాయి. రాష్ర్టంలో నాలుగు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి.
కోడం పవన్‌కుమార్ 9848992825