అమెరికా అధ్యక్షుడుగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కాగానే ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుదారులలో సంతోషం వెల్లడైంది. ట్రంప్‌ని మొదటగా అభినందించిన ప్రపంచ దేశాల నేతలలో మోడీ ముందు వరసలో ఉన్నారు. ‘మిత్రుడు’ ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారడంతో ఏర్పడిన చిక్కులతో పాటు దౌత్యపరంగా అంతర్జాతీయంగా భారత్ ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అనే సంతోషాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నిక కాగానే చైనాతో పాటు భారత్ నుండి వచ్చే వస్తువులపై సుంకాలను పెంచుతానని చెప్పడం, బ్రిక్స్ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ప్రోత్సహిస్తే ఆయా దేశాల సంగతి చూస్తానని బెదిరించడం వంటి చర్యలు సహజంగానే భారత్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇప్పటికే డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతూ వస్తున్నది. ఈ విషయంలో సరికొత్త సమస్యలు ఎదుర్కోవడం భారత్‌కు పరీక్షాకాలమే కాగలదు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో తన సంబంధం క్రమంగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నభారతదేశం, ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో బయలుదేరిన ట్రంప్‌ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. లోతుగా పరిశీలిస్తే ట్రంప్ ఎన్నికతో భారతదేశంలో వ్యక్తమైన హర్షాతిరేకాలు ఎక్కువకాలం నిలబడలేకపోవచ్చని అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా వాణిజ్యం, వలసలపై ట్రంప్ నేతృత్వంలో దృఢమైన వాషింగ్టన్‌తో సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో సంబంధాన్ని తేలికగా తీసుకునే ధోరణిని తగ్గించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే విషయంలో దాని చర్చల నైపుణ్యాలన్నింటినీ సమీకరించుకోవాలి. ‘అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం’ అనే ట్రంప్ రాడికల్ పరిష్కారాల పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ విదేశాంగ విధానానికి మరింత పదునుపెట్టాల్సి ఉందని గుర్తించాలి.
అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగ ధోరణిని గమనిస్తే తన పదవీకాలంలో ఒక నిమిషం కూడా వృథా కానీయకుండా వేగంగా, దూకుడుగా వ్యవహరించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ చేస్తున్న చాలా హామీలు 2016లో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చేసిన వాటి మాదిరిగానే ఉన్నాయి. అయితే వాటిలో చాలావరకు అమలు చేయలేకపోవడంతోనే 2020లో జో బైడెన్ ఎన్నిక కాగలిగారు. అందుకనే ఈ పర్యాయం అటువంటి అవకాశం లేకుండా చూడాలనే ఆత్రుత ఆయనలో కనిపిస్తుంది. అధ్యక్ష పదవి చేపట్టగానే వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయంతో గ్రీన్‌కార్డులు, హెచ్-1బి వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు.
ఇప్పటివరకు పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందని అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అనధికారికంగా ఉంటున్న దాదాపు 20,000 మంది భారతీయులు ఇప్పుడు వెనుకకు వచ్చే ముప్పు ఏర్పడినట్లు భావిస్తున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రక్షణ సంబంధిత ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసే విషయం లో మినహా ట్రంప్ భారత్‌కు చేసిన మేలు కనిపించదు. పైగా, మోడీ అధికారంలోకి రాగానే ‘భారత్‌లో తయారు’కు ప్రోత్సాహం కలిగించడం కోసం దిగుమతులపై ఆంక్షలు విధించడం ట్రంప్‌కు ఆగ్రహం కలిగించింది. అందుకనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విషయంలో మొండికేశారు. ఆ విషయం ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
జార్జ్ బుష్, బరాక్ ఒబామా, చివరకు కొంతవరకు జో బైడెన్ భారత్‌పట్ల చూపిన ప్రత్యేక ఆసక్తిని సైతం ట్రంప్ చూపిన దాఖలాలు లేవు. దౌత్యపరమైన అంశాలను ఆంతరంగిక రాజకీయ ప్రయోజనాలకు మిళితం చేస్తున్న కారణంగా భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ట్రంప్‌ను ఓ సజీవ ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంలో దౌత్యసంబంధాలను ఓ దేశం లో నెలకొన్న రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆయా దేశాలలోని వివిధ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకొనే ప్రయత్నం చేస్తుండాలి. కానీ, అందుకు భిన్నంగా మోడీ వ్యవహరిస్తున్నారు. 2016లో సైతం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుస్తారని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. హిల్లరీ క్లింటన్ గెలుస్తారని చాలా మంది భావించారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల సమయంలో భారత దేశ రాయబారి ఇద్దరు ప్రధాన అభ్యర్థులను కలిసి, భారత దేశం పక్షాన శుభాకాంక్షలు తెలపడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఆ సమయంలో భారత రాయబారి కేవలం హిల్లరీని మాత్రమే కలిసి, ట్రంప్‌ను భారత దౌత్యవేత్తలు ఎవ్వరూ కలవలేదు.
అందుకనే ప్రధాని కాగానే బరాక్ ఒబామా సమయంలో తొలిసారి అమెరికా వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి హడావుడి చేసిన మోడీ ఆ తర్వాత మూడేళ్ళ వరకు అటువంటి సాహసం చేయలేకపోయారు. మరో దేశ అధినేత వచ్చి తమ దేశంలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ‘అమెరికా ఫస్ట్’ అంటున్న ట్రంప్‌కు కోపం వస్తుందని భయపడ్డారు. ఆ తర్వాత ట్రంప్‌ను కూడా ఆహ్వానించి, ‘మరోసారి ట్రంప్ గెలవాలి’ అనే నినాదంతో మాత్రమే మోడీ సభ నిర్వహించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు ట్రంప్‌ను ఆహ్వానించి, కరోనా ముప్పును సైతం పట్టించుకోకుండా భారీ బహిరంగసభ జరిపి హడావుడి చేశారు. కేవలం ప్రవాస భారతీయుల ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే ట్రంప్ ఈ సభలలో మోడీతో పాల్గొన్నారని విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రముఖులు మరచిపోయారు. ఆ సమయంలో ట్రంప్ తిరిగి గెలవడం ఖాయం అనే అంచనాతో మోడీ ఆ విధంగా చేశారు. కానీ జో బైడెన్ గెలుపొందడంతో పలు అంశాలలో ఆయన ఇబ్బందిపడక తప్పలేదు.
ఈసారి కూడా అటువంటి పొరపాటు మరోసారి చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జి7 సదస్సుకు ఆ దేశం వెళ్లిన మోడీని కలిసేందుకు ట్రంప్ బహిరంగంగా ఆసక్తి కనబరచారు. ఆ సమయంలో పలు కేసులు ఎదుర్కొంటున్న ట్రంప్ గెలుపొందటం అసంభవం అనే అభిప్రాయంతో ట్రంప్‌ను కలిసేందుకు నిరాకరించారు. పైగా ఆ విషయాన్ని భారత్ మీడియాకు తెలిపింది. దానితో ట్రంప్ ఆగ్రహం చెందారని తెలుస్తున్నది. ఈ సందర్భంగా అమెరికా చరిత్రలో మొదటిసారిగా తన ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులను ఆహ్వానించిన ట్రంప్ అర్జెంటైనా, ఇటలీ వంటి చిన్న దేశాల అధినేతలను ఆహ్వానించి ‘మిత్రుడు’ అని భావిస్తున్న తనను ఆహ్వానించకపోవడం మోడీకి ఇబ్బందికరంగా మారింది.
విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రత్యేకంగా డిసెంబర్ చివరి వారంలో అమెరికాకు వెళ్లి, ఐదురోజులపాటు ఉంది మోడీకి ఆహ్వానం పొందేందుకు విశేష ప్రయత్నం చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయినా ఫలించలేదు. పైగా, భారత్‌కు ప్రత్యర్థిగా భావిస్తున్న చైనా అధినేతను ట్రంప్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. చైనా అధ్యక్షుడు హాజరు కాకపోయినా ఓ ప్రత్యేక దూతను పంపారు. ఆసియా- పసిఫిక్‌లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమెరికాకు భారత్‌ను రక్షణ, ఇతర వ్యవహారాలలో మద్దతు ఇవ్వక తప్పడం లేదు. అయితే, వాణిజ్య అవసరాల కోసం చైనా ముఖ్యమైనదిగా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. 2047 నాటికి అగ్రరాజ్యంగా ఎదిగేందుకు, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే అమెరికాకు సానుకూల సందేశాలను పంపవని గ్రహించాలి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల నుండి రష్యాను ఆదుకునే విధంగా పెద్ద ఎత్తున ముడి చమురు ఆ దేశం నుండి దిగుమతి చేసుకోవడం సైతం అమెరికాకు ఆమోదయోగ్యంగా ఉండబోదు.
ఇటువంటి ప్రతికూల అంశాలను అధిగమించి అమెరికాతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం భారత్ ముందు నేడున్న ప్రధాన సవాల్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది భారత్‌లో జరిగే క్వాడ్ సదస్సులో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది. ఈలోగానే అమెరికా వెళ్లి ట్రంప్‌తో భేటీ కోసం ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా వెళ్లిన జైశంకర్ ఈ విషయమై సంప్రదింపులు జరిపారు. మరోవంక, ట్రంప్ తీసుకొంటున్న కొన్ని దూకుడు నిర్ణయాల ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. అధికారం చేపట్టగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యుహెచ్‌ఒ నిధులలో 22.5% మేరకు సమకూరుస్తున్న అమెరికా వైదొలగితే ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సంస్థ సహకారంతో భారత్‌లో అమలులో ఉన్న పలు కార్యక్రమాలపై తప్పనిసరిగ్గా ప్రభావం ఉంటుంది. అటువంటి ప్రభావమే వాతావరణ మార్పు చర్చల నుండి అమెరికా వైదొలిగినా ఉండే అవకాశం ఉంది.
వైట్ హౌస్‌లో రెండో రోజే చైనా ఉత్పత్తులపై 15% సుంకాలను విధించిన ట్రంప్ భారత ఉత్పత్తులపై సైతం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. తరచూ తన మంత్రులను, సహాయకులను మార్చడంలో ప్రసిద్ధి చెందిన ట్రంప్‌కు శాశ్వత ‘మిత్రులు’ అంటూ ఉండరని, ఓ పక్క వ్యాపారవేత్తగా తన ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారని మనం గమనించాలి. చైనాతో విస్తృతమైన వ్యాపార ప్రయోజనాలు కలిగిన మస్క్‌కు ఒక వంక ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యత ఇస్తూ, చైనా పట్ల ద్వేషిగా పేరొందిన మరకో రూబియోను విదేశాంగ కార్యదర్శిగా నియమించడం ద్వారా అనూహ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో తన ప్రతిభను వ్యక్తపరిచారు. అందుకనే ప్రధాని మోడీ వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యూహాత్మకంగా అమెరికాతో వ్యవహరించాల్సి ఉంది.
చలసాని నరేంద్ర
9849569050