వాషింగ్టన్ : అక్రమ వలసల అణచివేతే లక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అక్రమ వలస దారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే అయ్యే అవకాశం ఉంది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపు లోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదే అని అలబామా రిపబ్లికన్ సెనేటర్ కేటీ బ్రిట్ పేర్కొన్నారు. అయితే ఈ బిల్లు అమలుకు ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు.
దీంతో బిల్లు ఆమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మెక్సికో సరిహద్దుల్లో శరణార్ధ శిబిరాలు అక్రమ వలసదారులను బయటకు పంపుతాననే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్ధ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. టెక్సాస్ లోని ఎల్ పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది. బహిష్కరణకు గురైన వారి కోసం ఏర్పాటు చేస్తోన్న ఈ శిబిరాలు ప్రారంభ దశ మాత్రమే. వలసదారుల సంఖ్య ఆధారంగా వీటిని పెంచుతాం అని మెక్సికో లోని ఓ అధికారి తెలిపారు.
ఇతర దేశాల నుంచి వలస వచ్చి అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారిని మెక్సికన్ నగరానికి పంపించాలని ఆయన సూచించారు.1500 క్రియాశీలక బలగాలను మోహరించిన పెంటగాన్ దక్షిణ సరిహద్దుల్లో నిఘా కోసం 1500 క్రియాశీలక బలగాలను మోహరిస్తున్నట్టు పెంటగాన్ పేర్కొంది. ఇప్పటికే నిర్బంధించిన 5 వేల మందికి పైగా వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు తాము మద్దతుగా ఉంటామని పెంటగాన్ వెల్లడించింది. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం తాము సైనిక విమానాలను పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్ సాలెస్సెస్ తెలిపారు.