Friday, January 24, 2025

ఉబర్,ఓలాకు కేంద్రం నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఉబర్, ఓలా వంటి యాప్‌లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్‌లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్‌ఫామ్‌లో వేరే ఛార్జీని వసూలు చేస్తుండటంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈమేరకు పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఎ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఛార్జీల వసూలు, అందుకు అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. వివక్షతకు సంబంధించి ఆందోళనల్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడుతుందా ? ఐఫోన్ వినియోగదారులను ధనికులుగా చూస్తూ కంపెనీలు కంపెనీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయా?

చాలా కాలంగా వినియోగదారుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ ధరల్ని వేర్వేరు మొబైళ్లలో పోలుస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతేకాదు ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా చేపట్టిన పరిశీలన లోనూ ఈ విషయం వెల్లడైంది. చెన్నై లోని మూడు రూట్లలో ఈ సంస్థ ప్రతినిధులు ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల నుంచి ఒకే సమయంలో క్యాబ్‌లు బుక్ చేశారు. మూడు రూట్ల లోనూ ఆండ్రాయిడ్ నుంచి బుక్ చేసిన వారి కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడింది. మదిపక్కం నుంచి వెలచెరి పియోనిక్స్ మాల్‌కు ఆండ్రాయిడ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.195 పడగా, ఐఫోన్ నుంచి బుక్ చేసిన వ్యక్తికి రూ.260 పడింది. టీనగర్ నుంచి ఎగ్మోర్‌కు ఆండ్రాయిడ్ యూజర్‌కు రూ.180 పడగా, ఐఫోన్ యూజర్‌కు రూ.344 పడింది. అవది నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు ఆండ్రాయిడ్‌లో రూ. 961 పడగా, ఐఫోన్‌లో రూ. 1010 పడింది. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News