Monday, February 24, 2025

ఆరురోజులైనా…ఆధారాల్లేవు

- Advertisement -
- Advertisement -

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న
మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు
శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో
పోలీసులు విఫలం హత్యోదంతంలో
సమాధానాలు దొరకని ప్రశ్నలు
ఎన్నో

రాచకొండ కమీషనరేట్, మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన వెంకట మాధవి అతికిరాతకంగా నరికి చంపిన భర్త ఆమె శవాన్ని చిన్నచిన్న ముక్కలుగా నరికి ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి చెరువులో కలిపిన కేసు ఒక హైఓల్టేజి సస్పెన్స్ క్రైం ధ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది.కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగుతున్న క్రమంలో పొలీసులు తమ తలలు పట్టుకునే స్ధాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉత్పన్నం అవుతున్నాయి.దీంతో ఈ నేర కధనంలో తరువాత దృశ్యం ఏమై ఉంటుంది..?అని తెలుసుకోవాలన్న ఆతృత ప్రతిఒక్కరిలో తారాస్ధాయికి చేరుకుంటుంది. పొలీసులు నిందితుడు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని గత 6 రోజులుగా విచారిస్తున్నప్పటికీ ఒక్క క్లూ కూడా లభించకపోవడం గమనార్హం.

శాస్త్రీయ ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ…
జిల్లెలగూడలోని న్యూవెంకటేశ్వరనగర్‌కాలనీలో గల గురుమూర్తి ఇంటి బయట గల సిసికెమోరాల్లో ఈనెల 16వ తేదీ భార్య,భర్తలు ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే రికార్డు అయ్యాయి. అయితే తిరిగి వెంకటమాధవి ఇంటి నుండి బయటకు వచ్చిన దృశ్యాలు రికార్డు కాకపొవడంతో గురుమూర్తిని అదేరోజు పొలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.కాగా మొదట్లో తన భార్యను తానే ఎందుకు చంపుతానంటూ బుకాయించిన గురుమూర్తి….పొలీసులు తమదైనశైలిలో విచారించగా వెంకట మాధవిని తానే హత్యచేసినట్లుగా గురుమూర్తి చేసిన నేరాన్ని పొలీసుల సమక్షంలో ఒప్పుకున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.కాగా ఈ వార్తను పొలీసు అధికారులు ఎవరు అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ భార్యను హతమార్చడంతో పాటు ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన నట్లు తెలుస్తోంది.

అయితే గురుమూర్తి ఉపయోగించిన ఆయుధాలు, శరీర భాగాలను ఉడికించేందుకు వినియోగించిన ప్రెషర్ కుక్కర్,రక్తం మరకల ఆనవాళ్లు లభించకుండా,శరీర భాగాలను ఉడికించే క్రమంలో దుర్వాసన వ్యాపించకుండా గురుమూర్తి తీసుకున్న జాగ్రత్తలపై ఆరా తీస్తున్నారు. వీటితోపాటు సంద చెరువులో వెంకట మాధవి శరీర భాగాల అవశేషాలను కనుగొనడం తదితర కీలకమైన శాస్త్రీయ ఆధారాలను సేకరించడంపై దృష్టిసారించారు. అయితే నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లుగా కాకుండా స్వీయ విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నేరపూరిత ఉద్దేశ్యంతో తాను పాల్పడిన కిరాతకానికి సంబంధించి గురుమూర్తి వెల్లడిస్తున్న వివరాలను పదేపదే మారుస్తూ పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఒక వేళా హత్య జరిగితే ఒకడే చేశాడ లేదా వేరే వ్యక్తులు గురుమూర్తికి సహకరించారా…ఎందుకు చేశాడు? అన్న విషయాలపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవి?
ఈనెల 18వ తేదీన గురుమూర్తి పొలీసులకు ఫిర్యాదు చేసినట్లుగానే వెంకట మాధవి తనతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవడం వాస్తవమే అయితే ఆమె ఇంట్లో నుండి బయటకు వెళ్లిన దృశ్యాలు సిసికెమోరాల్లో ఎందుకు రికార్డు కాలేదు..?,వెంకట మాధవిని హత్య చేసిన కత్తిని,ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసేందుకు ఉపయోగించిన రంపాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారా? వెంకట మాధవి ఎముకలను పొడిచేసేందుకు గురుమూర్తి ఉపయోగించిన రోకలి,రోకలి బండ ఏమైనట్లు..?,కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముక్కలుగా కోసిన మనిషి శరీరాన్ని తాను నివసిస్తున్న ఇంట్లోనే ఎండపెట్టి పొడిచేయడం సాధ్యమేనా..?,ఈనెల 13వ తరువాత గురుమూర్తి ఇంట్లో కనిపిచకుండా పోయిన వస్తువులు ఎక్కడ..?,వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్యచేసి,శరీర భాగాలను ముక్కలుగా నరికి,ప్రెషర్ కుక్కర్ ఉడికించి,ఎముకలను పొడిచేసి,చెరువులో పడివేయడంలో గురుమూర్తికి ఎవరైనా సహాయం చేశారా..?అన్న ప్రశ్నలు అంతుచిక్కకుండా ఉన్నాయి. గురుమూర్తి ఇంట్లో మద్యంసీసా లభ్యం కావడంతో మద్యం మత్తులో వెంకట మాధవిని హత్య చేశాడా అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

విచారణలో పొలీసులకు చుక్కలు చూపిస్తున్న గురుమూర్తి
విచారణ క్రమంలో గురుమూర్తి పొలీసులకు చుక్కలు చూపిస్తున్నాడన్న వార్తలు వెలువడుతున్నాయి. అత్త,మామలతో కలిసి తానే స్వయంగా పొలీస్‌స్టేషన్‌కు వచ్చి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే తననే అరెస్టు చేస్తారా అంటూ పొలీసులను గురుమూర్తి ఎదురు ప్రశ్నిస్తున్నాడని,ఈ వ్యవహారంపై తాను కోర్టుకు వెళ్తానని పొలీసులనే గురుమూర్తి బెదిరిస్తున్నట్లు సమాచారం.కాగా గతంలో సైన్యంలో పనిచేయడంతో నేరాలకు పాల్పడితే ఏవిధంగా తప్పించుకోవాలన్న అంశంపై అవగాహన ఉన్న గురుమూర్తి తన భార్య హత్యకు సంబంధించిన ఆధారాలను పొలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని పలువురు భావిస్తున్నారు.ఏదిఏమైనప్పటికీ వెంకట మాధవి హత్యకేసులో ఆధారాలను సేకరించడంలో పొలీసులు ఇప్పటికే తీవ్ర జాప్యం చేశారని,సాధ్యం అయినంత త్వరగా పొలీసులు తగిన ఆధారాలను సేకరించి అత్యంత కిరాతకానికి పాల్పడ్డ భర్త గురుమూర్తికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్న భావన మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

సైంటిఫిక్‌గా విచారణ చేస్తున్నాం: ఎల్‌బి నగర్ డిసిపి ప్రవీణ్ కుమార్
వెంకట మాధవి హత్య కేసును సైంటిఫిక్‌గా విచారణ చేస్తున్నామని ఎల్‌బి నగర్ డిసిపి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రస్థుతానికి మాధవి మిస్సింగ్ కేసుగానే భావిస్తున్నామని, మేరకు భర్తే హత్య చేసిఉంటాడనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో ఆ కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News