అవమానంతో ఓ తల్లి ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో గురువారం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ప్రేజా భర్త షేక్ బాజీని ఒక దొంగతనం కేసులో ఖమ్మం సిసిఎస్ పోలీసులు గురువారం నిదానపురం వచ్చి తీసుకుని వెళ్లారు. దొంగతనం కేసులో భర్తను పోలీసులు తీసుకువెళ్లడంతో అవమాన భారంతో ఇంట్లోకి వెళ్లిన వివాహిత ప్రేజా (35) కుమార్తెలు మెహక్ (3) మెనురూల్ (4) ఇరువురు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొడుకుని పోలీసులు తీసుకెళ్లడంతో ఆవేదన చెందిన తల్లి కోడలు, మనవరాలు ఎలా ఉన్నారని చూసేందుకు అత్త ఇంటి వద్దకు రాగా ఇల్లు లోపల గడిపెట్టి ఉండటంతో కిటికీలో నుండి లోపలకు చూడగా ఫ్యాన్‌కు మృతదేహాలు వేలాడున్నాయి. ఆందోళన గురై కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న వారిని కిందకు దించి పరీక్షకు పంపగా అప్పటికే మృతి చెందారు. ప్రేమ వివాహం చేసుకున్న వారి కుటుంబంలో దొంగతనం కేసు క్షణకావేశానికి గురిచేసింది. భర్త వ్యవహార శైలికి ఆవేదన చెంది ఆమెతోపాటు ముక్కు పచ్చలారని చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవటం గ్రామంలో విషాదాన్ని నింపింది. దీనిపై సీఐ మధు ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.