Friday, January 24, 2025

రూ. 1,78,950లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీ పెట్టుబడులపై ఒప్పందాలు ప్రపంచస్థాయిలోని 20 ప్రముఖ
సంస్థలతో ఫలించిన చర్చలు గత సంవత్సరం కన్నా 4 రెట్లు అధికంగా పెట్టుబడులు కొత్త
ఒప్పందాలతో 49,500 మందికి ఉద్యోగావకాశాలు నిరుడు వచ్చిన పెట్టుబడులు
రూ.40-,232కోట్లు మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో తెలంగాణ
ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన.. నేడు హైదరాబాద్‌కు

అమెజాన్ రూ. 60 వేల కోట్లు
ఉర్సా క్లస్టర్ రూ.9500 కోట్లు
బ్లాక్‌స్టోన్ రూ. 4,500 కోట్లు
మైత్రా ఎనర్జీ రూ. 7000 కోట్లు
టిల్మాన్ రూ.15 000 కోట్లు
ఇన్ఫోసిస్ రూ. 750 కోట్లు
గోపన్నపల్లిలో విప్రో కొత్త ఐటి సెంటర్
సంగారెడ్డిలో సుహానా మసాలా
ఎక్సలెన్స్ సెంటర్

దావోస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తన సత్తా చాటింది. పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, తన ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే వేదికపై సాధించిన పెట్టుబడుల రికార్డులను తిరగరాస్తూ సిఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బృందం భేష్ అనిపించుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి తెలంగాణ ప్రభుత్వం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను, ప్రత్యేక్షంగా 49,500 ఉద్యోగ అవకాశాలను సాధిం చింది. 20 బడా కంపెనీలతో ఒప్పందాలను కుదర్చుకుంది. రాష్ట్ర రాజధాని ఒక్క హైదరాబాద్‌లో కాకుండా పెట్టుబడులకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఈసారి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలే నిదర్శనం. సదస్సుకు మూడు రాష్ట్రాల సిఎంలు, ఆరు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలను సైతం అధిగమిస్తూ రెండవ స్థానంలో నిలువగా దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్ర రూ. 6.3 లక్షల కోట్ల పెట్టుబడులతో మొదటిస్థానంలో నిలిచింది.

మన తెలంగాణ/హైదరాబాద్ :దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డును నమోదు చేసింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటివరకు రూ.1,78,950 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పో లిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులు రావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అ భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూ నివర్సిటీ, రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం,

మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎం చుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్  2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. దేశ, విదేశాలకు చెందిన పేరొందిన 20 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1,78,950 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 49,550 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

20 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు..
20 ప్రముఖ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. 1. సన్ పెట్రో కెమికల్స్‌తో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్‌ను, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ సంస్థ ప్లాంట్‌లను నెలకొల్పనుంది. 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకానుంది. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 7,000 ఉద్యోగాలు లభించనున్నాయి. 2.అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇది రూ. 60,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. 3. కంట్రోల్ ఎస్ (CtrlS): తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇది రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 3,600 మందికి ఉపాధి లభించనుంది.

4. జేఎస్‌డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఈ కంపెనీ రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 200 ఉద్యోగాలు లభించనున్నాయి. 5. స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేటు రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6. మేఘా ఇంజనీరింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, 5,250 మందికి ఉపాధి కల్పించనుంది. 7. హెచ్‌సిఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సిఎల్ కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 5,000 మందికి ఉపాధి కలుగనుంది.

8. విప్రో : హైదరాబాద్‌లో విప్రో కంపెనీ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల 5,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 9. ఇన్ఫోసిస్: హైదరాబాద్‌లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ చేయనుంది. పోచారంలో ఐటీ క్యాంపస్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 17,000ల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఈ కంపెనీ వల్ల లభించనున్నాయి. 11. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్: హైదరాబాద్‌లో ఆధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేయనుంది. సుమారుగా రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. 12. ఉర్సా క్లస్టర్స్ : అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ఆధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. ఈ కంపెనీ రూ. 5,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

13. బ్లాక్‌స్టోన్ : ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 14.అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ) : ఆధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 15.ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ : ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా హైదరాబాద్‌లో కొత్త ఆఫీసు ఏర్పాటు చేయనుంది. 16.సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్: సంగారెడ్డిలో ప్రస్తుతమున్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుచేయనుంది. 17.రాంకీగ్రూపు: డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ పార్క్‌తో పాటు డెవలప్‌మెంట్ ఆప్ ఎకో టౌన్ అండ్ డ్రైపోర్టు ఏర్పాటు చేయనుంది. దీనికి కోసం ఈ సంస్థ రూ.5వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.

18.ఫెనోక్స్: ఈ సంస్థ ఎయిర్‌క్రాప్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెసిలిటీ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.250 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.19.ఎజిలిటీ: ఈ సంస్థ తెలంగాణలో అగ్రిటెక్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో రూ.400 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.20.సిఫీ: ఈ సంస్థ 200 మెగావాట్ల డేటా సెంటర్‌తో పాటు ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్‌లను వరంగల్‌తో పాటు వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి రూ.10 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News