Friday, January 24, 2025

చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా డాకు మహారాజ్

- Advertisement -
- Advertisement -

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ’డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ’డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తూ బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ‘గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ’ పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు. అందం, నటన కలబోసుకున్న నటి ప్రగ్యా. ఇక శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ లో ఫైర్ బ్రాండ్. గీత రచయితలు అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యం అందించారు. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమా డాకు మహారాజ్‌”అని అన్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ “రాయలసీమ బాలకృష్ణ అడ్డా. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్‌కి రావడం సంతోషంగా ఉంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు.

నేను చిరంజీవి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ దగ్గర చోటు లేదు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కి థాంక్స్. భవిష్యత్‌లో బాలకృష్ణతో డాకు మహారాజ్‌ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను”అని తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ “బాలకృష్ణ సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, విజయ్ కార్తీక్, మోహన్ కృష్ణ, చక్రవర్తి, యుగంధర్, నిరంజన్, రూబెన్, వేద అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News