Friday, January 24, 2025

వలసవాదులపై ట్రంప్ ద్వేషం

- Advertisement -
- Advertisement -

‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అన్న నినాదంతో అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమెరికాలో ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ప్రపంచంలో తిరుగులేనిశక్తిగా అమెరికా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించడంలో తప్పులేదు. కానీ అది నియంతృత్వానికి, సామ్రాజ్య విస్తరణ కాంక్షకు దారితీస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వలసలను కట్టడిచేసే దిశగా జన్మతా వచ్చే పౌరసత్వం రద్దుపై డెమోక్రాటిక్ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఇదే విధంగా లక్షలాది అనధికార వలసవాదులపైన, అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి అనుమతి కోరే వలసవాదులపైన విపరీత ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది.

అలాగే నేరస్థులైన విదేశీయుల్ని వెంటనే బహిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు. గత బైడెన్ ప్రభుత్వం 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల వరకు అక్రమ వలసవాదులను అమెరికా దేశంలోకి ప్రవేశింప చేశారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదిలా వుండగా అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు కాంగ్రెస్ బుధవారం(జనవరి 22) ఆమోదం తెలపడం విశేషం. కానీ వలసవాదుల వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే వాటిని ట్రంప్ విపరీతంగా వక్రీకరిస్తున్నట్టు బయటపడుతోంది. అధికారిక అంచనాల ప్రకారం 11 మిలియన్ మంది వలసవాదులు అమెరికాలో ఉన్నారు. ఇతర అంచనాల బట్టి చూస్తే 13 మిలియన్ల నుంచి 14 మిలియన్ల వరకు అక్రమ వలసవాదులు ఉన్నారని తెలుస్తోంది. ఇవేవీ ట్రంప్ నిర్ధారణలకు పొంతన లేకుండా ఉన్నాయి. 2022 నాటికి 2.3 లక్షల భారతీయ వలసవాదులు ఉన్నారని తేలింది.

అమెరికాలో ప్రస్తుతం ఎలాంటి ధ్రువపత్రాలు లేని 11 మిలియన్ వలసవాదుల్లో 80% మంది 2010కు ముందు అమెరికా వచ్చినవారే. వీరిలో 1.5 మిలియన్ మంది కొన్ని దశాబ్దాల క్రితం 19801990 మధ్య అమెరికాకు వచ్చారు. ఎవరు అమెరికాలో శరణార్ధలుగా ఆశ్రయం పొందాలో, ఎవరు పొందకూడదో నిర్ణయించే ఇమ్మిగ్రేషన్ కోర్టు ఉన్నతాధికారులను కూడా ట్రంప్ డిస్మిస్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ కోర్టుల్లో 3 మిలియన్ కన్నా ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంతేకాకుండా అమెరికాలో ఆశ్రయం పొందడానికి అభ్యర్థించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ సిపిపి వన్‌ను కూడా ట్రంప్ మూసివేయించారు. కేవలం ఒక ఏడాది లోనే ఇమ్మిగ్రేషన్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 2.4 మిలియన్ నుంచి 3.5 మిలియన్‌కు పెరిగింది. అమెరికాకు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే వారి సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో విశేషంగా పెరిగింది. దశాబ్దం క్రితం 1500 మంది భారతీయ అక్రమ వలసవాదులను అమెరికా సరిహద్దు అధికారులు అడ్డుకున్నారు. అయితే ఈ సంఖ్య 2023లో 96.917 కు. 2024లో 90415 కు పెరిగింది. అలాగే అమెరికాలో ఆశ్రయంకోరే భారతీయుల సంఖ్య కూడా పెరిగింది. హింసాత్మకం కాని చిన్నచిన్న నేరాలకు పాల్పడిన వారిని కూడా బందీలుగా చేయడానికి, దేశం నుంచి బహిష్కరించడానికి వీలు కల్పిస్తూ సెనేట్ ఆమోదించిన బిల్లు అధికారులకు సాధికారత కల్పిస్తోంది. కానీ విదేశాలనుంచి వచ్చే వలసవాదులు దేశంలో హింసాత్మక నేరాలను ప్రేరేపిస్తారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ ధ్రువీకరణ పత్రాలు లేకుండా వలసవచ్చిన వారిలో హింసాత్మక నేరాల రేటు అమెరికాలో పుట్టిన పౌరుల రేటు కన్నా తక్కువగానే ఉందని డేటా చెబుతోంది. నిర్దిష్ట జనాభా పాల్పడిన క్రిమినల్ నేరాల సంఖ్యను ఈ రేటు కొలమానంగా చెబుతుంది.

అమెరికాలో పుట్టిన పౌరులు, ధ్రువీకరణ పత్రాలు కలిగిన వలసవాదులు, ధ్రువీకరణ పత్రాలు లేని వలసవాదులు 2012 2018 మధ్యకాలంలో టెక్సాస్‌లో పాల్పడిన హింసాత్మక నేరాల పట్టికను పరిశీలిస్తే అమెరికాలో జన్మించిన పౌరులు చేసిన నేరాలలో సగం మాత్రమే అనధికార వలసవాదులు చేసినట్టు వెల్లడైంది. అంతేకాక అధికార వలసవాదుల కన్నా తక్కువ నేరాలే అనధికార వలసవాదులు చేసినట్టు తెలుస్తోంది. అమెరికా శ్రామికశక్తిలో అనధికార వలసవాదుల వాటాయే చెప్పుకోదగినంతగా మెజారిటీ స్థాయిలో ఉంటోంది. ముఖ్యంగా నిర్మాణరంగం, వ్యవసాయరంగంలో వీరి శ్రమశక్తి భాగం అధికంగా కనిపిస్తోంది. వలసవాదులను సామూహికంగా బయటకు పంపేస్తామని ట్రంప్ చెబుతుండడం, ఈ మేరకు చర్చలు జరుగుతుండడం ఆయా రంగాల వాణిజ్య సంస్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

తగిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి ఉంటుందని అంటున్నారు. సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ ఆఫ్ న్యూయార్క్ 2018 లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 5.5 మిలియన్ అన్‌డాక్యుమెంటెడ్ (ధ్రువీకరణ పత్రాలు లేని అనధికార) వలసవాదులు అమెరికా శ్రామికశక్తిలో భాగంగా ఉంటున్నారని బయటపడింది. ఇప్పుడు సామూహికంగా వీరందరినీ అమెరికానుంచి బయటకు వెళ్లగొడితే తక్షణం నిర్మాణరంగం పైన, వ్యవసాయ క్షేత్రాల పైన , రెస్టారెంట్ల పైన వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. తోటపనులు, లాండ్రీ, ఆటోరిపైర్, సేఫ్టీ, శానిటేషన్, తదితర అత్యవసర సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ధ్రువీకరణ పత్రాలులేని వలసవాదుల సంఖ్య ఎంతో స్పష్టంగా తెలుసుకోకుండా వారిని బయటకు పంపించివేయడానికి నిర్ణయాలు తీసుకోవడం సమస్యలకు దారితీస్తుంది. చాలా మంది అమెరికాలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అత్యవసర సేవల్లో పాలుపంచుకుంటున్నారు. ఎలాంటి క్రిమినల్ నేరాలకు వీలైనంతవరకు పాల్పడకుండా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు వీరందరినీ బయటకు పంపేస్తామని చెప్పడం అమెరికా ప్రజల దైనందిన జీవితాలపై కూడా ప్రభావం పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News