జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం
ఓటు ఔటు కన్నా శక్తి వంతమైనది. ఔటు ఐనా పేలదేమో, కానీ.. ఓటు ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఆయా పార్టీలకు సైతం ఇప్పుడు అర్థమైంది. మనం ఎందుకు ఓడి పోయాం.. అని
ఓటును తేలిగ్గా తీసుకుని “ఔట్” అయ్యిన వాళ్లకు తెలుస్తుంది. అమ్మో ఓటు కాదు అది ఔటు అని అర్థమయ్యేలా చేస్తుంది. ఓటుకు పట్టం కట్టే ప్రజాస్వామ్యం.
అధికారంలో ఉన్న వాళ్లకు, ఓటర్ తో అవసరం జ్ఞప్తికి వచ్చే తీరు కంటే, అధికారంలో లేని వారికి ఆ ఓటే..ఎంత శక్తి వంతమో తెలిసి “వచ్చేలా” చేస్తుంది, చేసింది ఓటు. రాజకీయాల్లో ఒడి, దుడుకులు, ఆటు పోట్లు, గెలుపు ఓటములు సాధారణమే అయినప్పటికీ. ఓటరు నాడి తెలిసిన నాయకులు, నాయకత్వం, ఏనాడూ ఓటరును గాని ఓటును గాని .. లేశ మాత్రంగా నైనా విస్మరించే ఆలోచన చేయరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు ఓటరును ఆకట్టుకునేందుకు రాజకీయాలు ఎన్ని పాట్లు పడ్డా.. ఓటును రాబట్టు కోవడానికి నమ్మకం ఇతోధికంగా పని చేస్తుందని అటు శాసన సభ, ఇటు లోక్ సభ ఫలితాల తో పాటు తాజాగా అగ్ర రాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు చెప్పడంతో పాటు హిత బోధ చేశాయి. ఓటరు ఎంత లోతుగా ఆలోచించినా, ఆలోచించకుండా ఓటు వేసినా. ఇవిఎంలలో నిక్షిప్తమైన ఓట్లు ప్రభంజనాన్ని సృష్టిస్తాయని స్పష్టత వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓటు మహిమ తెలిసిన వాళ్ళు ఎంతో జాగరూకతతో వ్యవహరించారు.
ఆ మనకు వేయక పోతే, ఇంకెవరికీ వేస్తారులే ఓటు అని ఒకింత అతి ఆత్మవిశ్వాసంతో ఉన్న వారికి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అని లెంప కాయలు వేసింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటు వేయడం విషయంలో విజ్ఞత ప్రదర్శిస్తారు ఓటరు అని తేట తెల్లం అయ్యింది. ఒక్క ఓటే కదా అని తేలిగ్గా తీసుకున్నా, కొన్ని ఓట్లే కదా అని పెద్దగా పట్టించుకొక పోయినా, ఒక్కో ఓటు.. ఔటు కన్నా శక్తి వంతమైనది అని. అటు గెలిచిన వాళ్లకు, ఇటు ఓడిన వాళ్లకు తాజా ఫలితాలు అర్థమయ్యేలా చేశాయి.
మాచన రఘునందన్
9441252121