కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు
ఇందిరమ్మ పేరు ఎట్లా పెడతారు?
కొత్త రేషన్‌కార్డులపై సిఎంతోపాటు
ప్రధాని ఫొటో ఉండాల్సిందే
కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే
పిఎం ఫొటో ఎందుకు పెట్టరు?
పిఎం ఫొటో పెట్టకపోతే ఉచిత
బియ్యం ఎందుకు ఇవ్వాలి?
కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ
సహాయ మంత్రి బండి సంజయ్
మనతెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రస్తకే లే దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని ఎస్‌బిఎస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక
కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావుతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు, వందలాది మంది బిఆర్‌ఎస్ నాయకులు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరారు. వారందరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ కాషాయ కండువాలు కప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ బియ్యంపై ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఇకపై కొత్త రేషన్‌కార్డులపై సిఎంతో పాటు ప్రధానమంత్రి ఫొటో కూడాపెట్టాల్సిందేనని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఎంఓయూలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారమంతా హంబక్ అని కొట్టి పారేశారు. గత పదేళ్లలో పాలించిన సర్కార్ 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని అవగాహన ఒప్పందాలు చేసుకుందని, ఆచరణలో మాత్రం పదో వంతు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్థి ఉన్నా 2014 నుండి నేటివరకు దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంఓయూలు జరిగాయి..ఎంతమందికి ఉద్యోగాలిస్తామన్నారు.. ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
‘నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు నమ్మి బిజెపిలో చేరుతున్న కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవికు సాదర స్వాగతం. మా పార్టీ మీ చేరిక వందకు వంద శాతం ఉపయోగపడుతుంది’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బిజెపిలో చేరుతామని చాలామంది వస్తున్నారని, అయితే భూకబ్జాలకు పాల్పడే వారిని చేర్చుకోబోమన్నారు. కరీంనగర్ అభివృద్ధికి నిధులు తెచ్చిందెవరో నిన్నటి కేంద్రమంత్రి రాకతో ప్రజలకు తేటతెల్లమైందని, ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ కమలానిదేనని అన్నారు. కేంద్రంనుండి నిధులు తెచ్చినా గత 10 ఏళ్లుగా ఏనాడూ బిఆర్‌ఎస్ తనను పిలవలేదన్నారు. స్మార్ట్ సిటీ పైసలు రాకుండా తాను కొట్లాడి తెస్తే నన్ను పిలవకుండా గులాబీ నేతలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారన్నారు. స్మార్ట్‌సిటీ నిధులను దారిమళ్లిస్తే తాను కొట్లాడితేనే ఆ నిధులను కెసిఆర్ మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోయాయన్నారు. అయితే, ఇపుడు బిఆర్‌ఎస్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు.కెసిఆర్ అడుగు జాడల్లోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని, ఆయన గురువు కెసిఆరేనని అన్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫాంహౌస్ సహా స్కాంలన్నీ మరుగున పడ్డాయన్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కెటిఆర్ రేపే అరెస్టు అంటూ నెల రోజులు ఊదరగొట్టి ఏంసాధించారన్నారు. కెటిఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సిఎం చెప్పిన తరువాత కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. కెసిఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారన్నారు. గ్రీన్‌కో వంటి సంస్థలను భయపెట్టడం వల్ల ఏం లాభమన్నారు. గ్రీన్‌కో సంస్థ నుండి కాంగ్రెస్ పార్టీకి చందాల రూపంలో పైసలు ముట్టాయని ఆరోపించారు. పార్టీ చందాల పేరుతో పైసలు తీసుకొని మళ్లీ ఆ సంస్థనే ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు అని అన్నారు. ఇప్పుడు దావోస్ పెట్టుబడులతో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ స్కాంలపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక ఛస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించా అరని ప్రశ్నించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే కేంద్రం నుండే నిధులు తెచ్చి కార్పొరేషన్ ప్రజలందరికి 24 గంటల పాటు నీళ్లందిస్తామన్నారు.
ఎంఎల్‌ఎ గంగుల అక్రమాల బండారం బయట పెడతా: కరీంనగర్ మేయర్ సునీల్‌రావు
కేంద్రమంత్రి బండి సంజయ్ నిధులు తెస్తే ఆ సొమ్మును దండుకున్న నీచుడు మాజీ మంత్రి, కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ అని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు ఆరోపించారు. తన జోలికొస్తే గంగుల అవినీతి, అక్రమాల బండారం బయట పెడతానని హెచ్చరించారు. తాను ఏ షరతు లేకుండానే బిజెపిలో చేరుతున్నానని, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని, ఏపని అప్పగించినా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. కరీంనగర్‌లో జరిగిన ప్రతి స్కాం వెనుక గంగుల కమలాకర్ ఉన్నారన్నారు. బండి సంజయ్ నాయకత్వంలోనే కరీంనగర్‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు. తనకు మేయర్ పదవి రావడానికి ప్రధాన కారణం మాజీ ఎంపి వినోద్‌కుమార్ అని గుర్తు చేశారు. తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నది గంగుల కమలాకరేనని తేల్చిచెప్పారు.