Monday, January 27, 2025

కిడ్నీల దోపిడీ.. కోట్ల రాబడి

- Advertisement -
- Advertisement -

కిడ్నీ రాకెట్ కొన్ని కోట్ల వ్యాపారం. మన దేశమే కాదు, ప్రపంచమంతా ఇది చాపకింద నీరులా కొన్నేళ్లుగా సాగుతోంది. బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాగిన కిడ్నీ రాకెట్ రెండుమూడు రోజులక్రితం బయటపడడంతో మళ్లీ ఇది ప్రముఖంగా చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో కిడ్నీ దాతలిద్దరూ తమిళనాడుకు చెందిన వారు కాగా, గ్రహీతలు కర్ణాటకకు చెందినవారు. కిడ్నీ గ్రహీతల నుంచి రూ. 50 లక్షల వరకు దళారులు గుంజుకున్నప్పటికీ, దాతలైన బాధితులకు చెల్లించడానికి ఒప్పుకున్నది కేవలం రూ. 4 లక్షలే. అయినా ఇంకా వారికి చెల్లింపు జరగలేదు. దీన్ని బట్టి ఈ రాకెట్ ఎన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందో తెలుస్తుంది. మనిషి శరీరంలో కిడ్నీల పాత్ర చాలా కీలకం. ప్రతి వ్యక్తిలో రెండు కిడ్నీలు ఉంటాయి. శరీరంలో మలిన పదార్ధాల వడపోత వీటివల్లనే జరుగుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని కిడ్నీ వైఫల్యం చెందితే వేరే దాతలనుంచి కిడ్నీ మార్పిడికోసం ప్రయత్నిస్తుంటారు.

సంపన్నులైతే దీనికోసం కొన్ని లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనుకంజ వేయరు. మనదేశంలో ఏటా 2,10,000 మందికి కిడ్నీల మార్పిడి అవసరమవుతుండగా, వీరిలో 8000 మందికే దాతల నుంచి కిడ్నీలు లభ్యమవుతున్నాయి. డిమాండ్‌కు, సప్లయ్‌కు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో కిడ్నీలను భారీ ఎత్తున సేకరించడానికి తాపత్రయం పెరుగుతోంది. ఈమేరకు అక్రమ పద్ధతులను అనుసరించి లక్షలు లక్షలు ఆర్జించడం భారీ రాకెట్‌గా సాగుతోంది. ఇందులో దాతలకు, గ్రహీతలకు మధ్య నుండే దళారీలకే కొన్ని లక్షలు అప్పనంగా అందుతున్నాయి. చాలా చోట్ల దాతలను ఏదో విధంగా ప్రలోభ పెట్టి కిడ్నీలను సేకరిస్తున్నారు. ఈ అక్రమాలను నివారించడానికి కిడ్నీ సేకరణ చట్టబద్ధంగా నిబంధనల మేరకు సాగాలన్న లక్షంతో దాతలకు పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వం అవయవ మార్పిడి (సవరణ) చట్టాన్ని 2011 లో తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం కిడ్నీలను పొందాలనుకుంటే దాతలు తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకులు, కూతుళ్లు, రక్తసంబంధీకులు, దగ్గరి బంధువులు, స్నేహితులనుంచి తప్ప వేరే వారి నుంచి బలవంతంగా తీసుకోరాదని చట్టంలో నిబంధనలు విధించారు.

కానీ ఈ నిబంధనలు అక్రమార్కులకు పట్టవు, కేవలం వ్యాపార దృష్టితో పేదలను, అమాయకులను డబ్బు ఆశ చూపించి లేదా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి కిడ్నీలు దోపిడీ చేయడం విచ్చలవిడిగా సాగుతోంది. న్యూఢిల్లీకి సమీపాన పారిశ్రామిక ప్రాంతం గుర్‌గావ్ కేంద్రంగా 2008 జనవరిలో నిర్వహించిన కిడ్నీ భారీ స్కామ్ దేశంలో సంచలనం కలిగించింది. ఇందులో బాధితులు ఎక్కువ శాతం పేదలే. వీరంతా సమీపాన పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కిడ్నీ శస్త్రచికిత్సలను చేయించుకున్నారు. ఈ దాతల కిడ్నీలు అమెరికా, బ్రిటన్, కెనడా, సౌదీ అరేబియా, గ్రీస్ దేశాల నుంచి వచ్చిన గ్రహీతలకు కొన్ని లక్షల మారకంతో చేరుకున్నాయి. మొరాదాబాద్‌కు చెందిన స్థానికులు ఈ కిడ్నీ దందాపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ గుట్టు వీడింది. ఈ స్కామ్ ద్వారా కిడ్నీలు ఆశించిన అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ దంపతులను, గ్రీకు జాతీయులు ముగ్గురిని 2008 జనవరి 25న పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది డాక్టర్లుతో సహా అనేక మంది అరెస్టు అయ్యారు. ఈ డాక్టర్లు గత తొమ్మిదేళ్లుగా 400 నుంచి 500 వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్టు వెల్లడైంది.

దాదాపు 50 మంది వైద్యాధికారులు ఈ రాకెట్‌లో పాలుపంచుకున్నారని తేలింది. ఈ రాకెట్‌ను నిర్వహించే డాక్టర్ ఒకరు ఐదుగురు విదేశీయులను లగ్జరీ గెస్ట్‌హౌస్‌లో వసతి కల్పించినట్టు బయటపడింది. చాలా మంది బాధితులు తమను ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, తమ కిడ్నీలు విక్రయించేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒకానొక దశలో కిడ్నీలు ఇవ్వడానికి ఇష్టపడకపోతే తుపాకీ గురిబెట్టి బెదిరించారని కూడా దాతలైన బాధితులు ఆరోపించారు. గుర్‌గావ్‌లో రోజూ ఏదో ఒక ఉద్యోగం కావాలని వెతుక్కుంటున్న కార్మికులను రూ.50 వేలు ఇస్తామని ఆశ చూపించి ఈ రాకెట్‌లోకి దింపుతున్నారు. రక్తపరీక్షలు చేసి ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత వీరు స్పృహ కోల్పోగానే ఆపరేషన్లు చేసి కిడ్నీలను తొలగిస్తున్నారు. గురుగావ్ కిడ్నీ స్కామ్‌లో కీలక సూత్రధారి అమిత్‌కుమార్.

అమిత్‌కుమార్ ముఠా గత దశాబ్ద కాలంలో 600 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమిత్‌కుమార్, ఆయన సోదరుడు జీవన్‌కుమార్, ఉపేంద్ర అగర్వాల్, సరాజ్ కుమార్ (అనస్థీషియో డాక్టర్) ఈ ముఠాయే ఈ రాకెట్‌ను గత కొన్నేళ్లుగా నడుపుతోంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అక్రమంగా అవయవ మార్పిడి ఆపరేషన్లు చేయించారన్న ఆరోపణలపై గతంలో మూడు సార్లు ఈ ముఠా అరెస్ట్ అయింది. ఈ స్కామ్‌లో పోలీసులు దాడి చేస్తారని ముందుగానే తెలుసుకుని అమిత్‌కుమార్‌తోపాటు అతని ముఠా విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించింది. భారత్ నేపాల్ సరిహద్దుకు 35 మైళ్ల దూరంలో అడవిలో ఒక రిసార్టులో అమిత్‌కుమార్ దాక్కొని ఉండగా చివరకు 2008 ఫిబ్రవరి 7న అరెస్టు చేయగలిగారు.ఆ సమయంలో నేపాల్ పోలీసులకు తనను విడిచి పెడితే కొన్ని లక్షలు లంచం ఇస్తానని అమిత్‌కుమార్ నచ్చచెప్పినా అది ఫలించలేదు. 2013 మార్చిలో సిబిఐ కోర్టు వీరికి ఏడేళ్లు శిక్షవిధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News