హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో 76వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత గవర్నర్, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. 50వేల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతోంది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ప్రజా ప్రభుత్వం.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తోంది. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.12 వేలు ఇస్తాం. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లో పౌష్టికాహారం అందిస్తున్నాం. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రజా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది” అని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదర్భంగా పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నివాళులర్పించారు.