ముంబయి : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఘటన జరిగి పది రోజులు దాటినా కొన్నింటికి సమాధానాలు లభించడం లేదు. ఈ విషయంలో అటు సైఫ్ కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఇటు ఆయన చికిత్స చేయించుకున్న లీలావతి ఆసుపత్రి నుంచి గానీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. బాంద్రా పోలీసులకు లీలావతి ఆసుపత్రి డాక్టర్ భార్గవి పాటిల్ సమర్పించిన మెడికో లీగల్ నివేదిక ప్రకారం సైఫ్ అలీ ఖాన్‌పై ఈ నెల 16న తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకునేందుకు పట్టేది పది నిమిషాలు మాత్రమే. కానీ సైఫ్ 4.11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు.
శరీరంలో ఆరు చోట్ల కత్తిపోటు గాయాలు అయినా, దాదాపు 2 గంటల పాటు సైఫ్ ఇంటిలో ఏమి చేసినట్లు అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఆయనకు అయిన గాయాల్లో ఒకటి వెన్నుపూసకు దగ్గర్లో 2.5 అంగుళాల లోతు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వెన్నులో పదునైన లోహపు ముక్కలు ఉండిపోయినప్పటికీ, మరొక పక్క వెన్ను నుంచి రక్తం కారుతున్నప్పటికీ సైఫ్ అంత సేపు ఎలా తట్టుకోగలిగారు? ఆటోలో సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు మరొక వ్యక్తితో పాటు సైఫ్ కుమారుడు తైమూర్ః (7) కూడా ఉన్నాడు. అయితే, సైఫ్ అసుపత్రిలో చేరిన సమయానికి, ఆటో డ్రైవర్ చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఆయన భార్య కరీనా ఇంటిలో ఉన్నారా? కింది అంతస్తులో గొదవ విని పైనుంచి కరీనా కిందకు పరుగెత్తుకుంటూ వచ్చినట్లు చెబుతున్నారు.
ఆమె నిజంగా ఇంటిలో ఉండి ఉంటే భర్తతో పాటు ఆసుపత్రికి ఎందుకు రాలేదు? ఇటువంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా పిల్లలను ఆయాల వద్ద వదిలిపెడుతుంది. కానీ, కరీనా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతకు ముందు ఆమె పార్టీకి వెళ్లి రావడంతో సైఫ్‌తో ఆసుపత్రికి వెళ్లే స్థితిలో లేరా? సైఫ్ శరీరంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కలు తొలగించేందుకు దాదాపుఆరు గంటలు పట్టిందని వైద్యులు చెప్పారు. అంతేకాదు, వారు తొలగించిన ముక్కల ఫోటోలు కూడా చూపించారు. పోలీసులకు డాక్టర్ పాటిల్ ఇచ్చిన నివేదికలో ఈ ముక్కల వల్లే గాయాలు అయినట్లు తెలిపారు.
అయితే, ఫోరెన్సిక్ నివేదికలో మాత్రం దాడి కత్తితో జరిగింది కాదని.పదును లేని ఆయుధం వల్లే జరిగిందని చెబుతున్నారు. మరి కత్తితో జరిగిన దాడిగా చెబుతున్నదానిలో నిజం ఎంత? సైఫ్ ఇంటిలోకి చొరబడినట్లుగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాంను మొదట ఎదుర్కొన్న ఆయాల్లో ఒకరు నిందితుని వద్ద పెద్ద కత్తితో పాటు చెక్క రాడ్ వంటిది ఉన్నట్లు చెప్పారు. ఆ రాడ్ వల్లే గాయాలయ్యాయా? భర్త సైఫ్‌ను రక్షించేందుకు కరీనా కపూర్ ప్రయత్నించారా? అదే జరిగితే ఆయాకు అయినట్లు ఆమెకు గాయాలు ఎందుకు కాలేదు? సైఫ్ అలీ ఖాన్ గానీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ ఉత్తమణి గానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు.దీనితో ఈ విషయంలోఇంకా ఏదైనా జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.