Thursday, January 30, 2025

విషపూరిత యమున నీటిని ఢిల్లీ వాసులను తాగనివ్వం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హర్యానాలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం యమునా నదిలో ‘విషం’ కలిపిందని ఆరోపించిన మరునాడు మంగళవారం ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ చట్టపరమైన చర్యకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ‘మురికి, విషపూరిత నీరు’ కారణంగా ఢిల్లీ వాసులను తాను చావనివ్వబోనని కేజ్రీవాల్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రం నుంచి సరఫరా చేస్తున్న నీటిలో అమ్మోనియా అనే ‘విషాన్ని’ కలిపినట్లు ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) సిఇఒ సోమవారం ఒక లేఖలో ధ్రువీకరించినట్లు కేజ్రీవాల్ విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. కేజ్రీవాల్ ఆరోపణను హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఖండించారు. కేజ్రీవాల్ కనుక క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనపై పరువునష్టం దావా వేస్తామని సైనీ బెదరించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ విషయమై ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారులతో భేటీ అవుతారని కేజ్రీవాల్ తెలిపారు. సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడుతూ, హర్యానా ముఖ్యమంత్రి ఈ విషయమై రాజకీయాలు చేయరాదని అన్నారు. ‘ఇది పాపం. మీరు ప్రజల శాపానికి గురవుతారు’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘నాపై కేసు వేస్తామని వారు బెదరిస్తున్నారు. వారు నన్ను జైలుకు పంపారు, వారు ఇప్పుడు నన్ను ఉరి తీస్తారా?’ అని ఆయన అన్నారు. బిజెపి ‘మురికి రాజకీయాలు’ చేయకూడదని ఆయన కోరారు. యమునలో పరిశుద్ధ నీటిని విడుదల చేయాలని హర్యానా ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది ఇలా ఉండగా, డిజెబి సిఇఒ శిల్లా షిండే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్రకు సోమవారం రాసిన ఒక లేఖలో కేజ్రీవాల్ ఆరోపణను తోసిపుచ్చారు. ఆయన ఆరోపణ ‘పూర్తిగా అసత్యం, నిరాధారమైనది, తప్పుదారి పట్టించేది’ అని ఆమె స్పష్టం చేశారు. డిజెబి క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరీక్షించిందని, తదనుగుణంగా ప్రక్షాళన ప్రక్రియను సరి చేసిందని ఆమె వివరించారు. తగ్గిన నీటి ప్రవాహం, ప్రక్షాళన చేయని మురుగునీరు లేదా పారిశ్రామిక వ్యర్థ జలాలు కలవడం వల్ల శీతాకాలాల్లో యమునలో సహజంగానే అమ్మోనియా స్థాయిలో పెరిగాయని కూడా శిల్పా షిండే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News